డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ గారు ప్రముఖ దంత వైద్యులు. వరంగల్ హైదరాబాదు నగరాలలో సాహితీ సాంస్కృతిక సంస్థలతో కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఇటీవల మిత్రుడు కస్తూరి మురళీకృష్ణ ద్వారా ప్రసాద్ గారు పరిచయమయ్యారు. కేవలం డాక్టర్ గానే కాకుండా గొప్ప సాహితీవేత్తగా ఆయన పరిచయం నా అదృష్టం అని చెప్పవచ్చు. ఇటీవల ప్రసాద్ గారు తీసుకువచ్చిన కథాసంపుటి "నాన్నా పెళ్లి చేయవూ ! " అనే పుస్తకం నాకు ఇవ్వడం జరిగింది. దీని కంటే ముందే ఆయన అనేక విషయాల మీద అనేక పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఇక ఈ సంపుటం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఇందులోని ప్రతి కథ చాలా క్లుప్తంగా చదువుకోడానికి ఆహ్లాదకరంగా ఉన్నది. 68 పేజీల ఈ పుస్తకంలో 11 కథలు ఉండగా ఎందుకో దాదాపు పాతిక పేజీలు పరిచయాలు కి స్వగతాలు కి ముందు మాటలకి కేటాయించారు. ఇవన్నీ చదివితే లోపలి కథలు చదవాల్సిన అవసరం ఉందా అన్న అనుమానం కూడా నాకు కలిగింది. అయినా సరే పుస్తకం అంతా చదివిన తర్వాత అన్ని కథలని అంతస్సూత్రంగా కలిపినటువంటి ఒక టెక్నిక్ ని రచయిత ప్రయోగించారు అనిపించింది. అదే ఉత్తరాలు రాయడం. మనసులోని భావాలను మాటల ద్వారా చెప్పలేనప్పుడు అక్షరాన్ని ఆశ్రయించటం సహజంగా జరుగుతుంది. ఈ టెక్నిక్ ని రచయిత తన కథల్లో ఉపయోగించారు. ఈ పుస్తకానికి టైటిల్ గా పెట్టిన "నాన్న పెళ్లి చేయవూ" అనే కథ చివర్లో రాఘవరావు పెద్ద కూతురు స్వప్న ఉత్తరం ద్వారా తండ్రికి తన మనసులోని భావాలు తెలియజేస్తుంది. తల్లిదండ్రుల వల్లనే తనకు ఇంతకాలం పెళ్లి కాలేదని వయసు అయిపోయిందని కనీసం తల్లిదండ్రులు అర్థం చేసుకొని తన తర్వాత తమ్ముళ్ళకి చెల్లెలకి త్వరగా వివాహాలు చేయమని తండ్రికి ఒక భారీ ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం ద్వారా తండ్రి మనసు మారింది అనుకోవచ్చు. ఇక మరో కథ "అందుకే.... అలా!! ". ఈ కథ ప్రారంభంలోనే ఉత్తరాల చరిత్ర ముగిసిపోయింది రా అంటూ మొదలవుతుంది. ఉత్తరాల గురించి చర్చించుకున్న మిత్రులకి అమెరికా నుండి కొడుకు రాసిన ఉత్తరం రాజేందర్ అతని భార్యని కలవరపెడుతుంది. తండ్రికి ఇష్టం లేకపోయినా అమెరికా వెళ్ళిన కొడుకు అక్కడ తన జీవితం గురించి అక్కడ తను అనుభవిస్తున్న స్వేచ్ఛ, సుఖసంతోషాల గురించి ఎంతో లోతుగా ,అర్థవంతంగా తన తండ్రికి వివరించటం తో ఈ కథ ముగుస్తుంది. మరోకథ "అపరిచితుడు" లో ఉత్తరాల ద్వారా మోసాలు ఎలా జరుగుతాయో వివరిస్తారు రచయిత. నిజాయితీ అనే మరో కథలో వయసు మీరిన తరువాత కూడా శృంగార వాంఛ తీర్చుకోవాలనుకున్నమణి, అశ్వినీల భావావేశానికి ఓ ఉత్తరం ద్వారా కనువిప్పు కలిగిస్తారు రచయిత. అశ్విని రాసిన ఉత్తరంతో తప్పు జరగలేదు, జరక్కుండా రెండు జీవితాల్ని కాపాడింది స్నేహితురాలు అశ్విని అని అర్థం చేసుకుంటాడు మణి. ఇక ఆఖరి కథ "దిల సా" లో శ్రవణ్ ఆఫీస్ పని ముగించుకుని తన స్నేహితుడితో ఇంటికి వస్తే అక్కడ భార్య ఉండదు. శ్రవణ్ వచ్చే సమయానికి అన్ని పనులు ముగించుకుని భర్త కోసం ఎదురు చూసే శుభ లేకపోవడంతో ఖంగు తింటాడు. ఇల్లంతా వెతికితే భార్య ఎక్కడికో వెళ్లిపోయి నట్టుగా అర్థమవుతుంది. ఇంతలో పక్కింటి పదేళ్ల అమ్మాయి ఆంటీ మీకు ఈ కవర్ ఇమ్మన్నారు అంటూ శ్రవణ్ కు ఇచ్చేసి వెళుతుంది. ఈ ఉత్తరం ద్వారా శుభ వైవాహిక జీవితంలో పడ్డ కష్టాలు, జీవితం తను కోరుకున్నట్లుగా లేకపోవడం, భర్త తనని ఏవిధంగా అపార్థం చేసుకున్నాడు అన్న విషయాలన్నీ వివరంగా రాస్తుంది. ఈ ఉత్తరం చదివి తన ప్రవర్తనతో సిగ్గుపడ్డ శ్రవణ్ భార్య కోసం బయలుదేరుతాడు. ఈ కథలో ముగింపు రచయిత ఇచ్చిన ట్విస్ట్ చాలా బాగుంటుంది. అయితే పక్క ఇంటిలోనే ఉండి శుభ అతని హావభావాలను గమనిస్తున్న విషయం అతనికి ఇంకా ఎంత సేపటికి తెలుస్తుందో మరి అని ముగించారు రచయిత. ఇలా ప్రధానమైన కథలన్నీ రచయిత ఉత్తరాల ద్వారా ముగించటం ఆయనకు ఉత్తరం రాయటం లో ఉన్నటువంటి ఆనందం, ప్రయోజనం బాగా అర్థం అవుతోంది అని మనం అనుకోవచ్చు. వృద్ధాప్యంలో వచ్చే మరుపు ఆ వృద్ధులను ఎంత ఇబ్బంది పెడుతుందో ఎంతో ఎమోషనల్ గా "మరుపు" అన్న కథలో వివరిస్తారు. ప్రతి నెల ఒకటో తారీకు న బ్యాంకులో పెన్షన్ క్రెడిట్ అవుతుంది. కానీ ఒక రోజు 11 గంటల దాకా మెసేజ్ రాకపోవటంతో ఆ వృద్ధ దంపతులు కంగారుపడ్డారు. చివరికి ఆ రోజు ఆదివారం అందుకే బ్యాంక్ ఉండదు మెసేజ్ రాదు అని అర్థం చేసుకోవడానికి భార్య భర్తల ఎమోషన్స్ తో చాలా సేపు కథ నడిపించారు రచయిత. చివరికి వృద్ధాప్యం వచ్చింది నా శరీరానికి కానీ నా మనసుకు కాదు అంటూ చిలిపిగా ముగిస్తారు ఈ కథ.
మొత్తానికి ఈ కథలు అన్నిటిలో కదిలించేవి ట్విస్టులు ఏమీ లేకపోయినా ఏకబిగిన ప్రశాంతంగా చదివిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి