పాలబువ్వా పచ్చగడ్డి -(డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212)

 ఒక రైతు దగ్గర ఒక ఎద్దు ఒక కుక్క ఉండేవి. అవి రెండు రైతు చెప్పిన పని చెప్పినట్లు పూర్తిచేసేవి.
రైతు కూడా వాటిని బాగా చూసుకునేవాడు.
అవి రెండూ మంచివే గానీ ఒకటంటే మరొకదానికి అస్సలు పడేది కాదు. చీటికిమాటికి గొడవపడేవి. నోటికి వచ్చినట్టు తిట్టుకునేవి.
ఒకరోజు రైతు పని పూర్తి కాగానే ఎద్దు ముందు పచ్చగడ్డి, కుక్క ముందు పాలబువ్వ తినడానికి పెట్టి వెళ్లిపోయాడు.
కుక్క ఎద్దును చూసి "మన యజమాని నీకు అనవసరంగా మూడుపూటలా పచ్చగడ్డి పెట్టి పందిలాగా మేపుతున్నాడు. నాలుగు గంటలు పని చేస్తే ఎనిమిది గంటలు పడుకుంటావు. నీకు అసలు తిండి దండగ" అంది.
ఆ మాటలకు ఎద్దు కోపంగా "ఊరికే ఉత్తడబ్బా లెక్క లొడలొడా వాగడం కాదు... పొలానికి వచ్చి నాలాగా నాలుగు ఎకరాలు ఆగకుండా దున్ని చూడు... అప్పుడు తెలుస్తుంది నా పని ఎంత కష్టమో. అయినా పొద్దునంతా తిని తిరిగి, రాత్రిపూట కాసేపు భౌభౌమని అరిచే నీకు, నేను పడే కష్టం గురించి ఏం తెలుస్తుందిలే" అంది.
"అబ్బో పెద్ద చెబుతున్నావులే గొప్పలు. ఇంటిని, పొలాన్ని, ఆఖరికి నిన్ను కూడా దొంగల బారిన పడకుండా కాపలా కాసేది నేనే. ఇరవై నాలుగు గంటలు మెలకువగానే ఉంటాను. చిన్న చప్పుడైనా సరే చిటికలో లేచి నిలబడతాను. ప్రాణాలు పోతున్నా వెనుకడుగు వేయను. నీవు కూడా ఒకరోజు నాలా కన్నుమూయకుండా రాత్రింబవలు కాపలా కాయి చూద్దాం" అంది.
అలా అవి గొడవ పడుతూ వుంటే అంతలో ఒక గాడిద ఎద్దు వెనుక వైపు వచ్చింది. దానికి ఎద్దు వెనక వున్న పచ్చగడ్డి కనపడింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి ఆ గడ్డిని చప్పుడు కాకుండా తినసాగింది. ఇదంతా కుక్కకు కనబడుతోంది. కానీ చెప్పలేదు. "దీనికి ఈ రోజు రాత్రి బాగా కడుపు కాలుతుందిలే" అని లోపల్లోపల నవ్వుకొంది.
అంతలో ఒక పిల్లి ఇంకొక వైపునుంచి వచ్చింది. దానికి కుక్క వెనక ఉన్న పాలబువ్వ కనబడింది. నోరూరింది. రెండూ కస్సుమంటే కస్సుమంటూ గొడవ పడతా ఉండడంతో ఇదే సందనుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి చప్పుడు కాకుండా పాలబువ్వ తినసాగింది.
ఇదంతా ఎద్దుకు కనబడుతూనే ఉంది. కానీ "ఈ రోజు రాత్రి తినడానికి తిండిలేక దీని కడుపు బాగా కాలుతుందిలే" అని లోపల్లోపల నవ్వుకుంది.
రెండు అలా చాలాసేపు అరుచుకొని అలసిపోయి ఆకలై తినడానికి వెనక్కి తిరిగాయి.
ఇంకేముంది...
అక్కడ
ఎద్దుకు పచ్చగడ్డీ లేదు.
కుక్కకు పాలబువ్వా లేవు.
ఒకదానితో ఒకటి గొడవపడి ఆ రాత్రి అనవసరంగా రెండూ కడుపు మాడ్చుకున్నాయి.
*********
కామెంట్‌లు