అలిగిన అలరు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పలకరించలేదని
పెరట్లో
పూచినపువ్వు
అలిగింది

ముఖాన్నితిప్పుకొని
బెట్టుచేసి
చూపులను
చాటుచేసుకుంది

పరికించిన
పూవుతల్లి
విషయము
గ్రహించింది

పుష్పకన్యను
అనునయించి
పొంకాలు
చూపమన్నది

విరిని
పరిసరాలలో
పరిమళాలను
వెదజల్లమంది

తల్లిచెట్టు
చెంతకురమ్మని
నాకురహస్యంగా
సైగలుచేసింది

సుమబాల
ననుచూచి
సిగ్గుపడి
తలవంచుకుంది

పూబోడిని
తడిమా
చేతులలోకి
తీసుకున్నా

పూబాల
సంతసించి
పైకిక్రిందకి
అటూ ఇటూ ఊగింది

పరవశంతో
పకపకా
నవ్వులు
చిందింది

అందాలన్నీ
దాచకుండా
చూపింది
అలరించింది

పువ్వు
నాకుదక్కింది
కవిత
మీకుచిక్కింది

ఆనందం
వెల్లివిరిసింది
అదృష్టం
కలిసివచ్చింది


కామెంట్‌లు