మదిలో పన్నీరు కళ్ళాపి చల్లి
మమతల తామరల ముగ్గేసి
పుప్పొడి పసుపు మధ్యన ఉంచి
తలవాకిట వేచి చూచెద నీకై ప్రభూ!
కన్నుల కలల జాతరలే
మిన్నున వెలుగుకై ఆత్రములే!
వన్నెలు మారుట చూడగనే
వచ్చెడు జాడ తెలిసెనులే!
కొత్తగా వచ్చిన జన్మలో
పెద్దగా ఏమీ కోరనులే!
వద్దనక నీలో కలిపేసుకుంటే
పెద్ద వరమదే చాలునులే!
రేకులు విచ్చిన నా రూపునకు
రేపంటూ ఉండదులే
నీ కిరణము తాకిన తరుణమే
నా హృదయము నీలో కలిసేనులే!
మనుగడ సమయం తక్కువే
మమతల మోహం ఎక్కువే
కలతల నీడలు కరిగించి
కాచి రక్షించు దైవం నీవేలే!
నింగిని వెలిగే సుందర దీపం
నిండుగ చూచిన తొలగును పాపం
నిరతము వెలిగే ఆనందదీపం
నిలువగ జాలదు చూడక లోకం!
విరిసే కుసుమపు
మురిసే మనసున
మెదిలే తలపుల
హృదయ నివేదనం
జీవుల బ్రోచే దైవాన్ని స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి