న్యాయాలు -742
"సర్వం కార్యం సకారణ న్యాయము
*****
సర్వం అనగా మొత్తము, సమస్తము,అంతయూ. కార్యం అనగా పని, హేతువు, కార్యము,క్రియ,కృత్యము , చేష్ట,చర్య, సకారణం అనగా సరియైన కారణం,సరైన హేతువు, ప్రభావం అనే అర్థాలు ఉన్నాయి
ప్రతి యొక్క కార్యము సకారణముగా వుండును, కారణము లేనిదే కార్యము కలుగదు, జరుగదు అని అర్థము.
చేసే ప్రతి పనీ ఏదో ఒక కారణంతో జరుగుతుందని భావించడం, కార్యకారణ సంబంధం ఉందని గ్రహించినట్లయితే జరిగే ప్రతి సంఘటన లేదా సందర్భం మనిషి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుందనే భావనతో ఈ న్యాయము చెప్పబడింది.
అయితే ఒకోసారి కారణం అనేది వెంటనే బోధపడదు.తర్వాత్తర్వాత ఎప్పుడో దానికి సంబంధించిన ఫలితం కనిపిస్తుంది.ఓహో! అందుకేనేమో అలా జరిగింది అనుకుంటూ ఉంటారు.
ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే ఏదీ కారణం లేకుండా జరగదనీ,కారణం అనేది సత్యాన్వేషణకు మూలమనీ,లక్ష్యాలూ, వైఖరులు , సంప్రదాయాలు మొదలైనవి కారణాలను ప్రభావితం చేస్తాయని చెబుతూనే "శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు" అంటారు.
ఇక భౌతిక వాదుల దృష్టిలో కారణం అనేది తత్వశాస్త్రం,మతం, సైన్స్,భాష, గణితం మరియు కళ వంటి లక్షణాత్మకమైన మానవ కార్యకలాపాలతో సంబంధం కలిగి వుంటుందని చెబుతూ కారణాన్ని హేతుబద్ధతగా సూచిస్తారు.
ఇక దీనినే ఆయుర్వేద వైద్యులు తమ కోణంలో కారణం మరియు ప్రభావ సంబంధాన్ని వివరిస్తూ కారణం లేకుండా ఏ చర్య సాధ్యం కాదు.కారణం పని యొక్క నిద్రాణమైన దశ, మరియు పని కారణం యొక్క వ్యక్తీకరణ దశ అందువల్ల చర్య నిద్రాణస్థితిలోనూ కారణం లోపల ఉంటుంది అని, అది వ్యక్తీకరించబడితే క్రియ అంటారని చెబుతారు.
వాళ్ళు చెప్పిన దానిని బలపరుస్తూ కారణానికి మూడు లక్షణాలు ఉంటాయని, వాటిని సహేతుకంగా వివరించారు.
అది ఒకటి పూర్వ భవ అనగా ప్రాథమిక ఉనికి.ముందుగా సంభవించే కారకాలు.ఉదాహరణకు వస్త్రం కావాలంటే దానికి సంబంధించిన సామగ్రి ఉండాలి.అది లేకపోతే వస్త్రాన్ని తయారు చేయలేము.
రెండవది నియతత్వం అనగా నిరంతర ఉనికి.చర్యలో నిరంతరం ఉండే కారణం.
మూడవది అనన్యత సిద్ధి అనగా తప్పని సరి ఉనికి.తప్పని సరి కారణాలు లేకుండా చర్యలు ప్రారంభం కావు. ఉదాహరణకు ఆహారం వండాలంటే ఇంధనం మరియు అగ్ని ఉండాలి.
ఇక సామాజిక , సాంఘిక శాస్త్రాలు అనేక కారణాలు నిర్ధిష్టమైన సంఘటనలు సంభవించడానికి హేతువు అవుతాయి.అనేక కారణాలు తగినంత లేదా అవసరమైనంథ ఒకదానితో ఒకటి కలుస్తుంటాయని చెప్పాయి .
పై విషయాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే విధి రాత మినహా ఏ శాస్త్రం చూసినా "ప్రతి కార్యము సకారణంగా ఉంటుందనీ, ప్రతిచర్య జరగాలంటే చర్య ఉండాలనీ,చర్య ఉండాలంటే దానికి సంబంధించిన మూలం ఉండాలనేది" మనం గ్రహించగలిగాము.
దీనినే సమాజంలో వివిధ సంఘటనల ఆధారంగా చేసుకుని చూస్తే మంచి చెడు పనులు ఏవైనా చిన్నదో పెద్దదో కారణంతోనే మొదలవ్వడం మనం గమనించవచ్చు.అలాగే మానవ సంబంధాల్లో ప్రేమ ద్వేషం,పగలు ప్రతీకారాలను కూడా ఈ దృష్టితో చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది.
ఏది ఏమైనా అవసరమైనప్పుడు భౌతిక వాదులనూ, ఆధ్యాత్మిక వాదుల బోధలను స్వీకరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి,మంచి పనులను చేయడానికి ఈ "సర్వం కార్యం సకారణ న్యాయము"ను ఉదాహరణగా మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఇందులో మనకు ఏది నిజం అనిపిస్తే ఆ దారిలో మంచి పనులు చేస్తూ నడుద్దాం. అంతే కదండీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి