న్యాయములు-748
సంభవే వ్యభిచారే చ స్యా ద్విశేషణ మర్థవత్ న్యాయము
****
సంభవే అనగా పుట్టిన, సంభవము. వ్యభిచారము అనగానే మనకు తప్పు భావనతో కూడిన అర్థం గుర్తుకు వస్తుంది.అయితే వ్యభిచారము అనే పదాన్ని విడదీసి రాస్తే... "వి+అభిచారము=వ్యభిచారము అనగా అసలు ఆచరించకూడనిది.(ఇందులో చారము అనగా చరించదగినది అంటే ఆచారము అని అర్థము.).విశేషణ అనగా విశిష్ట చిహ్నము,గుణ వాచక శబ్దము. అర్థవత్ అనగా ధనవంతుడు, అర్థవంతమైనది,సఫలమైనది అనే అర్థాలు ఉన్నాయి.
సంభవము,మరియు ఆచరించకూడనిది వున్నప్పుడే విశేషణము అర్థవంతమవుతుంది అనే అర్థముతో ఈ న్యాయము చెప్పబడింది.
అయితే ఇందులో రెండు రకాల విరుద్ధ భావాలు ఉన్నాయి.అదెలా అంటే సంభవమున అనగా సంభవించిన లేదా పుట్టిన విశేషణము యొక్క ప్రతి పాదిత అర్థము లక్ష్యమున ప్రవర్తించుట( ప్రవర్తించుట వ్యవహరించుట అని అర్థము)
ఇక అసంభవము అనగా విశేషణ ప్రతిపాదిత అర్థము యొక్క లక్ష్యమునకు వ్యవహరించబడదు అని భావము. కాబట్టి అసంభవముగా ఉన్నప్పుడే క్రియా పదంతో కూడిన విశేషణం అనగా ప్రయుక్త విశేషణము సార్థకం అవుతుంది.
ఇది చదువుతుంటే కొంత అయోమయానికి, గందరగోళానికి గురి అవుతూ వుండటం సహజం. ఈ ఉదాహరణ ద్వారా సందేహ నివృత్తి చేసుకుందాం.
"ఆ ఇంటిలోని మంచి పిల్లవానిని పిలువుము"-అన్నప్పుడు ఆ ఇంట్లో కొందరు చెడ్డ పిల్లలు కూడా ఉంటే మనం ప్రయోగించిన 'మంచి' అనే విశేషణము సార్థకము అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మిగతా పిల్లలంతా మంచి వారు కానప్పుడు అంటే అసంభవం అయినప్పుడు విశేషణానికి సార్థకత చేకూరుతుంది.
అలా కాకుండా ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ మంచి వారు అయినప్పుడు 'మంచి ' అనే విశేషణానికి అర్థం మరియు సార్థకత ఉండదు.
మరో ఉదాహరణ కూడా చూద్దామా..."నీలముత్పలమ్" అనగా ఆ నల్ల కలువ అన్నప్పుడు నీలత్వం అనేది ఆ కలువ సామాన్య ధర్మం కాదన్న మాట. అలా కాకపోవడం వల్లనే "నల్లని కలువ"యని తక్కిన చాలా రంగుల కలువలలో నుండి ప్రత్యేకంగా వేరు చేసి చెప్పబడింది. ఇలా చెప్పడం వల్ల అసంభవ ప్రయుక్త విశేషణము సార్థకం అయింది.
ఒకవేళ కలువలు అన్నీ నీలము రంగులో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నల్లకలువ అని ప్రయోగించవలసిన అవసరము లేదు.అలా ప్రయోగించిన దానికి అర్థమేముంటుంది? ఉండదు కదా!
ఇదంతా విడమర్చి చెప్పుకున్న తర్వాత విషయం మనకు పూర్తిగా అర్థమైపోయింది. విశేషణమును సాధారణీకరించి ఉపయోగించడం వల్ల దాని వల్ల ఆయా వస్తువుల ప్రత్యేకత కానరాదు.
చాలా తేలికైన ఉదాహరణ ఫలానా పండితుల వారింట జన్మించిన ఓ వ్యక్తి పండితుడు అని చెప్పినప్పుడు అది సామాన్య ధర్మం అవుతుంది.అలా కాకుండా ఓ నిరక్షరాస్యుల కుటుంబంలో జన్మించిన గొప్ప పండితుడు అన్నప్పుడు గొప్ప అనే విశేషణం ప్రత్యేకత సంతరించుకుంటుంది.అనగా అసంభవంలో ప్రయుక్త విశేషణము సార్థకము అవుతుంది.
ఇదంతా తెలుగు భాష, వ్యాకరణానికి సంబంధించిన విషయం. ఇది కూడా ఓ న్యాయమా?అనిపిస్తుంది ఎవరికైనా. కానీ మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణ యుక్తంగా చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే మనం "నలుగురితో పాటు నారాయణ"గానో "గుంపులో గోవిందా" గానో వుండొద్దు నీదైన ప్రత్యేక ఉనికిని, వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని ప్రత్యేకించి చెప్ఫే విధంగా ఉండాలి. అప్పుడే ఈ "సంభవే వ్యభిచారే చ స్యా ద్విశేషణ మర్థవత్ న్యాయము"నకు న్యాయము జరుగుతుంది. కాబట్టి పలువురు గుర్తించేలా (మెచ్చుకునేలా) వృత్తి, వ్యక్తిత్వపరంగా రాణించాలని అర్థము. అది తెలిసినట్లయితే ఈ న్యాయము యొక్క గొప్ప తనము తెలుస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి