కాలక్షేపం : సరికొండ శ్రీనివాసరాజు
   శ్రావణి బడి నుంచి ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి "నా ఫ్రెండ్ శ్రుతి ఇంటికి వెళ్ళి హోమ్ వర్క్ చేసుకొని వస్తా అమ్మా!" అని చెప్పి పని కాగానే రాత్రి వేళ ఇంటికి వచ్చేది. ఇది చాలా రోజుల నుండి ఇలా జరుగుతుంది. శ్రుతి, శ్రావణి చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు కాబట్టి తల్లిదండ్రులు పంపేవారు. పైగా శ్రావణి, శ్రుతి ఇద్దరూ తెలివైన అమ్మాయిలు. 
      ఒకరోజు శ్రావణి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. శ్రావణి ప్రతిరోజూ స్నేహితురాలి ఇంటికి వెళ్ళి రావడం వాళ్ళ అమ్మమ్మకు నచ్చలేదు. ఒకరోజు శ్రావణి శ్రుతి వాళ్ళ ఇంటికి వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ అడ్డుపడింది. వెళ్లడానికి వీలు లేదు అన్నది. శ్రావణి వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించి మరీ అడ్డుకుంది. శ్రావణి ఎందుకు వెళ్లవద్దు అన్నది. "ఆడపిల్ల పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి దాకా ఉండటం ఏమిటి?" అని నిలదీసింది. "తన స్నేహితురాలితో కలసి చదువుకోవడం చిన్నతనం నుంచీ అలవాటు. ఇద్దరూ కలిసి చదవడం వల్ల శ్రావణి, శ్రుతి పోటాపోటీగా మార్కులు పెంచుకుంటున్నారు." అన్నది శ్రావణి వాళ్ళ అమ్మ.
"ఇంట్లో చదివితే బాగుపడరా?" అన్నది శ్రావణి వాళ్ళ అమ్మమ్మ. 
       అప్పుడు శ్రావణి ఇలా అన్నది. "శ్రుతి వాళ్ళ ఇంట్లో హోంవర్క్ చేసుకున్నాక శ్రుతి వాళ్ళ నాయనమ్మ రోజూ మమ్మల్ని ఇద్దరినీ కూర్చోబెట్టుకొని మంచి నీతి కథలు చెబుతుంది. ఇప్పటికి కొన్ని వందల నీతి కథలు విన్నాము. ఇక్కడ నాయనమ్మా! కథ చెప్పవా? అని ఎన్నిసార్లు  అడిగినా పట్టించుకోలేదు. అమ్మమ్మ వచ్చినప్పుడు అమ్మమ్మా! కథ చెప్పవా! అంటే అమ్మమ్మా పట్టించుకోలేదు. అయినా వీరికి తీరిక ఎక్కడిది? టీవీలలో రోజూ గంటల తరబడి దిక్కు మాలిన ఏడుపు గొట్టు సీరియల్స్ చూస్తూ వీళ్ళు నీతులు నేర్చుకునే స్టేజ్ లో ఉంటే మాకు నీతులు ఏమి చెబుతారు?" అని. అమ్మమ్మ నాయనమ్మ తల దించుకున్నారు. 
        "ఇక నుంచి శ్రుతి ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు. శ్రుతిని కూడా ఇక్కడకు తీసుకు రా. నేనూ కథలు చెబుతా." అన్నది నాయనమ్మ. "అలాగే." అంది సంతోషంగా శ్రావణి.

కామెంట్‌లు