న్యాయములు -755
"హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావక " న్యాయము
*****
హోతారమపి అనగా యజ్ఞగుండం జ్వలించునప్పుడు తనను హోమ ద్రవ్యాలతో..స్పృష్టో అనగా స్పృశించే లేదా సేవించే వారిని సైతం.దహతి పావకః అనగా అగ్ని దహించుచున్నది కదా అని అర్థము.
ముట్టుకొనిన యెడల అగ్ని హోత్రము తనలో హోమము చేయువానిని గూడా దహించును అని భావము.
దీనికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దామా...
"న కశ్చిచ్చణ్డ కోపానా,మాత్మీయో నామ భూభుజామ్, హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావకః"
అయితే దీనికి సమానార్థకంగా రాసిన తెలుగు కంద పద్యమును చూద్దాం.
"మనుజులలో నెవ్వరు దగఁ/దనవా డనువాడు దుష్ట ధరణీశునకున్?/దనకయి వ్రేలిమి వేల్చెడు/జనుని తనువు గాల్చు వాయు సఖుఁడదయుండై"
అనగా అగ్ని హోత్రుడు తన తృప్తికై ఆజ్యాదులు హోమము చేయువానిని సైతము తాకినంత మాత్రాన మొహమాటము లేకుండా కాల్చును.అట్లే అతి కోపులగు భూపాలురకును స్థిరముగా ప్రేమించ దగిన వాడు ఒకడును ఉండడు. వారెంతటి హితకారి నైనను ఇంచుక తప్పిన చంపింతురు అని అర్థము.
ఈ న్యాయములో రెండు కోణాలు ఉన్నాయి.తనను సేవిస్తూ,ప్రేమిస్తూ తన సేవలో సదా గడిపెడు,తనకు మేలు చేసే వ్యక్తినైనా...ఆ వ్యక్తిలో ఏ కొంచెం తనకు నచ్చని మార్పు వచ్చినా వెంటనే ఆ వ్యక్తిని చంపడానికి,మరణ శిక్ష వేయడానికి ఏ మాత్రం వెనుకాడరు అని అర్థము.
అనగా దుష్ట గుణము కలిగిన వారితో స్నేహము 'నిప్పును కొంగున కట్టుకున్నట్లే'... ఎప్పటికైనా కాలకమానదు అంటే ఎప్పుడైనా ప్రమాదమే.
ఇక రెండో కోణంలో చూస్తే..అసలే నిప్పు. దానిని ఇష్టమైన వారు ముట్టుకున్నా, ఇష్టం లేని వాళ్ళు ముట్టుకున్నా అగ్ని చేసే పనేంటంటే కాల్చడం. అగ్నికి తరతమ భేదాలు ఉండవు అనే అర్థంతో ఈ "హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావక" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి దుష్టులతో స్నేహము చేగూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఒకానొక నక్క నదీతీరాన కూచుని ఏడుస్తూ వుంటుంది. ఆ నదీ తీరాన ఉన్న ఎండ్రకాయలు/ పీతలు బొరియ నుండి బయటకు వచ్చి అడుగుతాయి.
అయితే నక్క తెలివిగా నటిస్తూ నాతో పాటు ఉండే నక్కలు మిమ్మల్ని తినాలని ప్రయత్నించాయి.అప్పుడు నేను అలా చేయకూడదు అని చెప్పాను.అందుకే నన్ను వెలివేసాయి . అని దీనంగా చెప్పేసరికి నమ్మాయి.
దాంతో ఒక నిండు పున్నమి వెన్నెల రోజు గీతాల్ని వెన్నెల చాలా బాగుంటుంది.అలా విహరిద్దాం రండి అని వాటిని తమ బొరియలకు చాలా దూరం తీసుకెళ్తుంది. అవి భయపడుతూ ఉంటే నేనుండగా మీకెందుకు భయం అంటుంది. అలా వెళ్ళిన తరువాత నక్క మూలుగుతుంది. అయ్యో ఏమైందో ఏమో అని పీతలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అక్కడికి నక్కల గుంపు వచ్చి కనబడిన పీతలను పట్టుకొని తినేశాయి. తప్పించుకున్న కొన్ని పీతలు నక్క దుష్ట బుద్ధి తలుచుకుంటూ దుష్టులతో స్నేహము చేయవద్దు.దాని చాలా నష్టం జరుగుతుంది అని బాధ పడ్డాయి.
అనగా ఇక్కడ అగ్నిని దుష్టుడితో పోల్చడం జరిగింది.
ఇక రెండో కోణంలో చూస్తే "తమ్ముడు తన వాడైనా ధర్మం తప్పు చెప్పకూడదు" అనే సామెతతో పోల్చి చెప్పవచ్చు. నిప్పు నిప్పే. అది పొయ్యిలో మండే నిప్పయినా? వేడితో వెలుగుతున్న దీపమైనా ముట్టుకుంటే కాలుతుంది.అది దాని స్వభావం.కాబట్టి స్వంత వాడే కదా,ఏమనడులే అని పబ్బం గడుపుకోవాలనుకునే వారికి తగిన శిక్ష విధిస్తుంది.అనేది ఎప్పుడూ గమనంలో పెట్టుకొని నడుచుకోవాలని మన పెద్దలు ఇలాంటి న్యాయాలను జీవితాలకు అన్వయించి చెబుతుంటారు.
కాబట్టి ఈ "హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావకః న్యాయము"ను సదా గమనంలో పెట్టుకొని జీవితం గడపాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి