వెలుగులతో కలిసుండాలని
వేకువకన్నా ముందే
వేయి కళ్లు తెరచి
వేచివున్న సుమ నికుంజాల
నిరీక్షణ ఫలించి కన్నులెదుట
నిలువెత్తు వెలుగుల రేడు
నింగిని తొంగి చూడ
నీరెండలోని నిగనిగలతో
నవ్వుల మెరుపులు
నిండుగ చుట్టుకుని
నీ కోసమే ఈ జన్మ..
నాదంటూ ఏమున్నదని...
నిజాయితీగా దాసోహమని
నిండుగ నవ్వుతూ అందంగా
నీ కోసమే నేననే భావనతో విరిసే
నిర్మల హృదయ.....సుమబాల
చల్లటి తెమ్మెర ఒకటి
నీటి అలల ఊయలలూగి
మెల్లగ వచ్చి పువ్వుల తాకి
కమ్మని పరిమళమంత దోచి...
తెరలుతెరలుగా తేలి
తెలివెలుగుల తేరులోన
తొలిసంధ్యలో ఊరేగు
తరణి కిరణముల కలదేనేమో!
కనకపు కాంతికి కమ్మని
సుమగంధము తోడై
ఇలకు ఇనుడి కరుణ
ఇనుమడించేలా చేసెనేమో
ఆవరించిన వెలుతురు
అలల సవ్వడితో కలిసి
అవనికి అందమైన సంగీతం
అందించే వేళ.....
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి