సుప్రభాత కవిత : -బృంద
ఎత్తు పల్లాల దారి 
ఎంతవరకు?
అడుగుల మధ్య ఒక 
సమన్వయం కుదిరేవరకు!

కరకు రాళ్ళ గుచ్చుళ్ళు 
ఎంతవరకు?
రాతి మొనల పదును 
అర్థమయేంత వరకు!

దూరం భారమనిపించేది 
ఎంతవరకు?
తీరం కళ్ళకు ఎదురుగా 
కనిపించేంత వరకు!

ఎదురయే కష్టాల ఇబ్బంది 
ఎంతవరకు?
ఎదలోన  ఎదుర్కొనే 
ధైర్యం ఉన్నంత వరకు!

అంతరంగాన ఆలోచనల
అలజడి ఎంతవరకు?
గమనంలోనే  గమ్యపు అనుభవం 
దొరికేవరకు!

వెనుకకు తిరిగి చూడక
ముందెంతో ఉందని భ్రమ పడక 
ప్రతి అడుగు ఉత్సాహంగా 
ప్రతి మలుపు ఒక పాఠంగా...

అవకాశాన్ని ఆస్వాదిస్తూ 
జీవితాన్ని అనుభవిస్తూ 
ప్రకృతితో మమేకమవుతూ
పయనం కొనసాగిస్తూ...

ప్రతి మాపూ కొత్త రేపుకై 
ఎదురుచూసే జీవితాలకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు