తెలియరాని తెరలేవో
తెలి వెలుగులు మింగేస్తే
తెల్లవారినట్టు లోకం
తెలుసుకోక ఉంటుందా?
తీగకున్న తలిరు మొగ్గలకు
తెలుసు విరిసే సమయమేదో
తావి పరచి పరిసరాలను
తాకి పరవశింపచేయక ఉంటుందా?
మంచు బిందువులు కురిసి
మహిని తడిపివేసినా
మార్తాండుని రాక చూసి
పుడమి మురియక ఉంటుందా?
సాగుతున్న ఏటికైనా
తరుగుతున్న చీకటిలో
జరుగుతున్న మార్పులు
ఎరుక లేక ఉంటుందా?
సమయ పాలన ప్రకృతిలోన
ప్రథమ నియమమే కదా
మనిషి ఎందుకు పాటించడు?
మరి గతి మారక ఉంటుందా?
ఏది ఏమిటో తెలియనివ్వక
మాయ తెరలు కమ్మించి
రూపమంటూ లేని రేపును
చూపుతానని ఊరించే
వెలుగుల వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి