న్యాయాలు-
హ్రద నక్ర న్యాయము
*****
హ్రద అనగా మడుగు. నక్ర అనగా మొసలి అని అర్థము.
"మడుగును మొసలి,మొసలి మడుగును రక్షించు కొనుచుండును" అని ఒక అర్థమైతే మరొక అర్థములోని మొసలి అనికూడా చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఈ న్యాయమును రెండు రకాలైన కోణాల్లో చూడవలెనని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది.
మొదటిది అన్యోన్య సంరక్షకత్వమును గురించి. రెండవది మొసలి నీటిలో ఉన్నప్పుడు, బయటికి వచ్చినప్పుడు దాని పరిస్థితి గురించి చెప్పుకోవాలి.
మొదటి దాన్ని చూసినట్లయితే మడుగును మొసలి రక్షించుట.మడుగులో మొసలి ఉన్నదని తెలిస్తే ఆ మడుగు జోలికి పోవడానికి ఎవరూ సాహసించలేరు.అలా మడుగు పాడవకుండా కాపాడబడుతుంది.
ఎలాగూ మొసలి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మొసలికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
మొసళ్ళు లేదా మకరాలు సరీసృపాల జాతికి చెందిన జంతువులు.ఇవి చాలా పురాతనమైన యుగానికి చెందినవిగా చెబుతుంటారు. ఇక వీటి దవడలు చాలా శక్తివంతమైనవి.నోటికి అందిన జంతువులను పటపటా విరిచేసే శక్తి దవడలకు ఉంది. ఇవి సాధారణంగా 70 నుండి 100 సంవత్సరాల పాటు బ్రతుకుతాయని అంచనా వేశారు.
సాధారణంగా నీటి వనరులలో సరస్సులు, నదులు, మహా సముద్రాలు, జలాశయాలు ఉంటాయనేది మనకు తెలిసిందే.అయితే మొసళ్ళు అధికంగా సరస్సులు,నదులు లాంటి మంచినీటి స్థలాల్లోనూ, అరుదుగా ఉప్పునీటి కయ్యలలోనూ వుంటుంటాయి.
మొసళ్ళు చాలా ప్రమాదకరమైన జంతువులు. వీటి మెరుపులా మీదపడే లక్షణం అంటే మెరుపుదాడితో మనుషులను, జంతువులను వేటినైనా సరే తప్పించుకునే అవకాశం లేకుండా చేసి చంపి తింటాయి.
అలా నీటి మడుగులను అవి సంరక్షిస్తూ ఉంటాయి. నీటి మడుగులు వీటిని ఎలా సంరక్షిస్తాయి అనే ప్రశ్నకు సమాధానంగా అవి మన జంతు సంపద కాబట్టి మొసళ్ళు ఉన్న నీటి వనరులను కలుషితం కాకుండా మానవులు చూస్తూ ఉండటం వల్ల మొసళ్ళు అందులో సంరక్షింపబడతాయి.
దీనిని మన పెద్దలు మనుషులకు వర్తింపజేసి చెప్పారు ."కుటుంబంలో పెద్దలు పిల్లలను సంరక్షిస్తూ వారిని ప్రయోజకులుగా చేస్తారు. అలా పెద్దలు వృద్ధులు అయ్యాక ఆ పెద్దలను సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుంది. ఇలా పిల్లలూ పెద్దలది అన్యోన్య సంరక్షకత్వమని చెప్పుకోవచ్చు.
ఇక రెండోది ఏమిటంటే మొసలికి మడుగులో ఉన్నంత సేపే బలం. బయటికి వస్తే అది శక్తిహీనం అవుతుంది.అంటే దాని స్థానం నీరు కాబట్టి నీటిలోనే మనగలుగుతుంది.
ఇది గమనించిన ప్రజాకవి వేమన దీనిని మనుషులకు వర్తింపజేస్తూ ఎంత చక్కని పద్యం రాశారో చూడండి.
"నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుగు పట్టు/ బయట కుక్క చేత భంగపడును/ స్థానబలిమి గాని తన బల్మిగాదయా / విశ్వదాభిరామ వినురవేమ!!"
అనగా నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నది అయినప్పటికీ చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగలదు.కానీ ఆ మొసలి తన స్థానమైన నీటిని వదిలి బయటకు వచ్చినపుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది.కాబట్టి మొసలికి అంత బలం తన స్థానం వల్ల వచ్చినదే కానీ స్వంత బలం కాదు అని భావము.
ఇక దీని గురించి వేరే చెప్పనక్కరలేదు.మనం మన ఉన్న ఊరులో బతకడానికి వలస పక్షుల వలె తెలియని చోటికి వెళ్ళి బతకడానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ మనకు స్థాన బలం ఉండదు.
ఇలా అన్యోన్య సంరక్షకత్వము మరియు స్థాన బలిమి గురించి ఈ "హ్రద నక్ర న్యాయము" ద్వారా మనం తెలుసుకున్నాం. వీటి ద్వారా మనం మన కుటుంబం, సామాజిక జీవనం ఎలా ఉండాలో కూడా అర్థం చేసుకోవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి