ఆడపిల్ల చదువు : సరికొండ శ్రీనివాసరాజు
 సోమయ్యకు ఇద్దరు పిల్లలు. రంగన్న మరియు అలివేలు.  సోమయ్య దంపతులకు ఇద్దరికీ రంగన్న చదువు మీద ఆసక్తి ఎక్కువ.  అలివేలు ఆడపిల్ల కాబట్టి చిన్నచూపు. తొందరగా చదువు మానిపించి,  వివాహం చేసి, అత్తగారింటికి వెళ్ళగొట్టాలని తల్లిదండ్రుల ఆలోచన.  అందుకే రంగన్నను పేరున్న ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. అలివేలును స్థానిక ప్రభుత్వ పాఠశాలో చేర్పించారు. 
      అలివేలు ప్రాథమిక విద్యాభ్యాసం మొదలు పెట్టినప్పుడు శ్రావణి అనే మంచి టీచర్  ఆ పాఠశాలలో పని.చేసేది. శ్రావణి టీచర్ పిల్లలను తన సొంత పిల్లలుగా భావించి, వారిని బాగా బుజ్జగిస్తూ,  ప్రోత్సహిస్తూ చదువు నేర్పేది. అలివేలు 5వ తరగతి పూర్తి అయ్యేసరికి శ్రావణి టీచర్ బోధనలో చాలా తెలివైన అమ్మాయిగా పేరు పొందింది. హైస్కూలుకు వచ్చేసరికి  సొంతంగా కష్టపడి చదివే స్థాయికి చేరుకుంది.  
     రంగన్న తల్లిదండ్రుల అతి గారాబంతో ప్రవర్తన గాడి తప్పింది.  పేరున్న ప్రైవేట్ పాఠశాల అయినా ఆ పాఠశాలలో అర్థం అవుతుందా లేదా అని గ్రహించక విద్యార్థుల చేత బట్టీ పట్టిస్తున్నారు. రంగన్న చదువు అంతంత మాత్రమే అయింది.  పైగా చెడు సహవాసాలు.  చెడు అలవాట్లు.  తల్లిదండ్రులకు తన కుమారుడు ఎలా చదువుతున్నాడో పట్టించుకునే ఆలోచన లేదు.  ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు కాబట్టి మంచిగా చదివి, భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేస్తాడని నమ్మకం. కానీ రంగన్న 10వ తరగతిలో అంతంత మాత్రం మార్కులే వచ్చాయి.  దాంతో ఇంటర్మీడియేటులో కాలేజీ ఫీజు భారీగా చెల్లించాల్సి  వచ్చింది.  ఇంటర్మీడియేటులో ఫెయిల్ అయ్యాడు. 
       అలివేలు 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.  చిన్నతనంలో చదువు చెప్పిన శ్రావణి టీచర్ అలివేలు ఇంటికి వెళ్ళి మరీ అభినందించింది. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివిస్తున్నారో అడిగింది. ఆడపిల్లలకు పెద్ద చదువులు అవసరం లేదని, వివాహం చేసి,  పంపిద్దామని అనుకుంటున్నామని అలివేలు తండ్రి చెబుతాడు. అలివేలు వెక్కి వెక్కి ఏడుస్తుంది.  శ్రావణి టీచర్ సోమయ్యపై మండి పడింది.  "ఆడపిల్ల అంటే చులకన భావమా! ఏం? ఆడపిల్ల మాత్రం మనిషి కాదా? నీకు చేత కాకపోతే చెప్పు. నేను దత్తత తీసుకుని చదివించుకుంటా." అన్నది శ్రావణి టీచర్.  అలివేలు టీచర్ వెంట ఉండి చదువుకోవాలని ఉందని అన్నది.  సోమయ్యకు చిరాకు వేసింది. చిన్నప్పటి నుంచీ పెంచీ పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే మధ్యలో వచ్చిన ఆ టీచర్ ఎక్కువైందా నీకు.  మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేదు." అన్నాడు సోమయ్య. 
         శ్రావణి టీచర్ అలివేలును ఉన్నత చదువులు చదివించింది.  ఆ తర్వాత అలివేలు తన మనసులో అనుకున్న లక్ష్యాన్ని చేరింది.  ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలని అనుకుంది. ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని అలివేలు నిర్ణయించుకుంది. శ్రావణి టీచరును అలివేలు ఆదర్శంగా తీసుకుంది. ఎన్నో దీపాలను వెలిగించింది.

కామెంట్‌లు