సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -754
హూనా మనుగ్రహో న్యాయము
*****
హూనా అనగా ఒక రకమైన బంగారు నాణెము ,అనాగరికుడు, ఒక పురాతన రాజ్యం పేరు. హూ అంటే తయారు చేయడం.అనుగ్రహ అనగా అనుకూలమగుట, అనుకూలము, అంగీకారము అనే అర్థాలు ఉన్నాయి.
పలువురు కలిసి సహాయం చేస్తేనే చాలా మేలవుతుంది.అందుకే పలువురు కలిసి ఒకే మాట మీద ఉండటం శ్రేయస్కరము.
బహూనా మప్య సారాణాం మేలనం కార్యసాధకమ్,తృణైః సంసాద్యతే రజ్జు స్తయా నాగోపి బధ్యతే" అనగా దుర్బలులైననూ పలువురు కలిసి యున్న నెంత పనినైనను సులభముగా సాధించవచ్చు.అదెలా అంటే గడ్డిపోచలు దేనికవే  బలము లేనివే అయినప్పటికీ పలు గడ్డిపోచలతో కలిపి పేనిన తాడుఏనుగును సైతం కట్టి వేయగలదు అని అర్థము.
ఈ న్యాయానికి చక్కని ఉదాహరణగా చీమలను చెప్పుకోవచ్చు. వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు కొన్నింటిని తెలుసుకుందామా...
అవి కంటిలో నలుసంత చిన్నవి. కానీ కలిసికట్టుతనంలో  వాటిని మించిన జీవులు లేవేమో అనిపిస్తుంది. ఒక ఇంట్లో ముగ్గురు, నలుగురు ఉంటేనే ఏదో ఒక సమయంలో భేదాభిప్రాయాలు వచ్చి చికాకు కలిగిస్తుంది.కానీ ఆ చిన్ని చిన్ని చీమలు ఒకే పుట్టలో వందలు వేలు,లక్షల  చీమలు కలిసిమెలిసి ఉంటాయి.
కలిసికట్టుగా జీవించడంలో పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవంటారు.వీటిల్లో రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు,కాపలా చీమలు ఉంటాయి. వేటి పని అవి చక్కగా నిర్వర్తిస్తాయి.
రాణి చీమకు రెక్కలు ఉంటాయి.దానికి గుడ్లు పెట్టడం తప్ప మరో పని చేయదు.ఇక శ్రామిక చీమలు.ఇవి రాణి చీమకు నిరంతరం సేవలు చేస్తూ ఉంటాయట.రాణీ చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటూ ఉంటాయిట. అంతే కాకుండా రాణి గారు పెట్టిన గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుండి పిల్లలుగా మారి పెద్దయ్యేంత వరకు వాటి సంరక్షణ బాధ్యత శ్రామిక చీమలదేనట. ఇక ఈ చీమలు ఉన్న పుట్టను కాపాడే బాధ్యత సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా ఉన్న చీమలు ఒక రకమైన రసాయనాన్ని  విడుదల చేస్తాయి.ఆ రసాయనాన్ని పసిగట్టగానే సైనిక చీమలు మూకుమ్మడిగా దాడికి దిగుతాయి. అలా వుంటుంది వాటి కలిసికట్టు తనం లేదా ఐకమత్యం.ఈ ఒకే ఒక్క శత్రు దాడి విషయంలోనే కాదు ఏ చీమకైనా ఆహారం కనబడితే చాలు వెంటనే పెరోమోన్స్ అనే రసాయనాన్ని విడుదల చేసుకుంటూ తమ ఇంటి దాకా వస్తుందట.అలా ఆ వాసన పసిగట్టి వచ్చిన చీమలతో కలిసి ఆహారం దగ్గరకు చేరుకుంటుంది.
 అలా ప్రతి విషయంలోనూ కలిసికట్టుతనం,వేసవి కాలంలోనే ఆహారాన్ని సేకరించుకుని తమ పుట్టలలో నిలువ చేసుకోవడం మరియు క్రమ శిక్షణ పాటించే ఆ చీమల నుండి ఐకమత్యం, సహకార భావాన్ని నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే పక్షి జాతిలో కాకులు ఎంతగా కలిసికట్టుగా ఉంటాయో  మనందరికీ తెలిసిందే. తినే ఆహారం కనిపిస్తే మిగతా కాకుల్ని పిలుచుకోవడం.తిరుగుతూ తిరుగుతూ వాటిల్లో ఏదైనా కాకి చనిపోతే  సామూహికంగా దుఃఖాన్ని పంచుకోవడంతో పాటు వాటిల్లో ఏ ఒక్క కాకికి హాని కలిగించినా మూకుమ్మడిగా దాడి చేయడం... ఇలాంటివి మనుషులు ఎన్నో నేర్చుకోవచ్చు.
కట్టెల మోపు తెప్పించి  ఒంటరి కట్టెను విరిచినంత తేలికగా మోపును  విరవలేమని ఋజువు చేయించి  నలుగులు కొడుకులు కలిసి ఉండేలా చేసిన ఓ తండ్రి కథ. వలలో చిక్కుకున్న పావురాలు అన్నీ కలిపి వేటగాడి బారినుండి ఎలా తప్పించుకున్నాయో...! ఐకమత్యంతో ఉన్నప్పుడు ఏమి చేయలేని పులి ఎద్దులలో ఐక్యత పోయినప్పుడు వాటిని పులి ఏ విధంగా సంహరించిందో... ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు కథలు, కథనాలు వినొచ్చు.కనొచ్చు.
ఇక చివర్లో వేమన చెప్పిన పద్యాన్ని చూద్దామా...
"ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు/ దాని బలిమి నెంతయైన గూడు/గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుగు/ విశ్వదాభిరామ వినురవేమ/' 
అనగా  గడ్డిపోచల్లో ఒక్కొక్క దానికి బలం ఉండదు కానీ వాటిని కలిపి పేనితే అది బలమైన మోకుగా తయారవుతుంది . దాంతో బలమైన ఏనుగును సైతం కట్టి వేయవచ్చు...ఈ పద్య భావం అందరికీ తెలిసిందే.
ఇలాఃటిదే  వేమన గారు రాసిన మరో పద్యాన్ని' చూద్దామా...
.."ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయు?/ నందకొండు విడ్డ పొందు చెడును/స్వీయుడొకడు విడిన జెడుకదా  పనిబల్మి/ విశ్వదాభిరామ వినురవేమ!/
అనగా ఐదు వేళ్ళూ కలిపితేనే పిడికిలి బలంగా వుంటుంది.చెయ్యి బాగా పనిచేస్తుంది.ఇందులో ఏ ఒక్క వేలును వదిలేసినా ఆ చేతికి బలం ఉండదు.పని చేయడం కష్టమవుతుంది.కుటుంబములోనైనా, బృందములో నైనా కూడా అంతే.అందరూ  సయోధ్యతో ఉంటేనే పనులు సక్రమంగా జరుగుతాయి.ఏ ఒక్కరు వ్యతిరేకంగా ఉన్నా ఫలితం చెడుతుంది.అందుకే ఐకమత్యం, సమిష్టి తత్వం ఎంతో గొప్పది, మేలు.
ఇలా సమాజంలోని ప్రజలు కలిసి మెలిసి వుంటేనే సమాజానికి, తమకు మేలవుతుంది. అది అర్థం చేసుకోవడం కోసమే మనం ఇన్ని ఉదాహరణలు ముచ్చటించు కున్నాం. కాబట్టి పలువురు కలిసి ఒకే మాట మీద ఉండాలి అని చెప్పడమే ఈ "హూనా మనుగ్రహో న్యాయము" లోని అంతరార్థము. దీనిని గమనంలో  పెట్టుకొని ఇరుగు పొరుగుతో కలిసి మెలిసి ఉందాం.అనుకున్న  మంచి పనులు ఆనందంగా సాధిద్దాం.

కామెంట్‌లు