సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-747
స్వభావో దురతిక్రమః న్యాయము
******
స్వభావం అంటే పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం.దురతి అనగా కాలము లేదా కొనసాగింపు.దుర అంటే చెడు.దరతిక్రమః అంటే దుర్+అతిక్రమః అనగా అతిక్రమించడానికి సాధ్యపడనిది అని అర్థము.
పుట్టుకతో లేదా సహజంగా వచ్చిన బుద్ధి లేదా స్వభావమును అతిక్రమించడమనేది సాధ్యపడదు.
మనిషి స్వభావము ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది .1.సంక్రమించేది.2తనంతట తాను పరిగ్రహించేది.
అలాంటి స్వభావమును దాచుట,దాటుట చాలా కష్టము."యః స్వభావోహి యస్య స్యాత్త స్యాసౌ దురతి క్రమం,శ్వాయది క్రియతే రాజా తత్కిం నాశ్నాత్యు పానహమ్?" అనగా "కనకపు సింహాసనమున/శునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం /దొనరగ బట్టము గట్టిన /వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!" అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
"తేలుకు కుట్టే బుద్ధి, పాముకు కరిచే లక్షణం, దుష్టుడికి దుర్మార్గపు గుణం, సాధువు లేక సజ్జనుడికి త్యాగం, సాయం అనేవి దాదాపుగా పుట్టుకతోనే వస్తాయి. వాటిని మార్చడం చాలా కష్టం అనే అర్థం ఈ న్యాయములో స్ఫురిస్తుంది..
వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం.
 మన పెద్దవాళ్ళు "పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదు" అంటారు.అనగా ఎవరికైనా చిన్న వయసు నుంచి వచ్చిన అలవాట్లు అంత త్వరగా వారిని వదిలి పెట్టవు అని అర్థము. 
బంగారు సింహాసనంపై కుక్కని కూర్చుండబెట్టినా దానికి రాజులా రాజసం రాదు. రాజుకు ఉండే లక్షణాలైన ఠీవి, హుందాతనం చూపలేదు.ఆహార విషయంలో అది కనుకుతూనే తింటుంది.తాగడంలో అది గతుకుతూనే తాగుతుంది.  అలాగే చెప్పు తినడానికి ఇష్టపడే కుక్క చెరకు తీపిని ఆస్వాదించగలదా?లేదనే జవాబు వస్తుంది. అంటే దాని యొక్క సహజత్వాన్ని దాటుట,మీరుట చాలా కష్టము.
మన చిన్నప్పుడు చదువుకున్నాం ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ - నీవెంత ఉడికినా నీ (కంపు) వాసన పోదు", చిమడకే చిమడకే ఓ చింతకాయ- నీవెంత చిమిడినా నీ పులుపు పోదు"... అలా వాటి సహజ గుణములు మారవనేది మనకు అర్థమవుతోంది.
అందుకే వేమన  ఇలా అంటాడు" ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను/ హీనుడవగుణంబు మానలేడు/బొగ్గు పాల గడుగ బోవునా మలినంబు/ విశ్వదాభిరామ వినురవేమ "
అనగా ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నా గాని, మూర్ఖుడు తన అవలక్షణాలను మానలేడు.నల్లని బొగ్గును ఎన్ని సార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? అవదు కదా! అలాగే సహజంగా వచ్చిన బుద్ధి కూడా అంతే.
తేలు -తాబేలు కథను చూద్దాం. ఒకసారి తేలు నీళ్ళలో పడి కొట్టుకొని పోతుంది. దానిని ఓ తాబేలు చూసి "అయ్యో! పాపం!" అనుకుని జాలిపడింది.దగ్గరకు వెళ్ళి తేలును తన వీపు మీద ఎక్కించుకొని పోసాగింది. కానీ తేలు ఎలాంటి కృతజ్ఞత లేకుండా తాబేలును కుట్టసాగింది. తాబేలుకు బాధేసింది. ఏమిటి తేలూ! నేనేమో నిన్ను రక్షిస్తుంటే  నువ్వు నన్ను కుడుతున్నావు. ఇది భావ్యమేనా?"  అడిగింది. 
అప్పుడు తేలు" కుట్టడం నా స్వభావం. నా గుణం.దాన్ని  నేను మార్చుకోలేను" అంది. "ఓహో!అలాగా! మునగడం నా స్వభావం. నేను కూడా నా గుణాన్ని మార్చుకోలేను." అంటూ నీటిలో బుడుంగున మునగడంతో తేలు తాబేలు మీంచి జారి కొట్టుకుపోసాగింది. 
అంటే ఇక్కడ హీనుడిని తేలుతో పోల్చారు మన పెద్దలు.రక్షించే వ్యక్తికి కూడా హాని చేయడానికి వెనుకాడని వాడు హీనుడు.అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ గుణాలను అధిగమించలేరు అనే అర్థంతో ఈ "స్వభావో దురతిక్రమః న్యాయము" ను ఉదాహరణగా చెప్పవచ్చు.
కాబట్టి అలాంటి వ్యక్తులను గమనించి  సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. వారికి సాయం చేయడం తేలుకు సాయం చేయడం లాంటిదేనని  గ్రహించాలి.

కామెంట్‌లు