రంగయ్య, రామయ్య ఇద్దరివీ పక్కపక్క ఇల్లులు. వాళ్ళిద్దరూ కలసి ఒక రోజు పక్క ఊరిలో సంతకు బైలుదేరారు. సరుకులు అన్నీ కొనేసరికి బాగా చీకటి పడింది.
రంగయ్యకు చీకటంటే చాలా భయం. “రేయ్... ఈ రోజు ఇక్కన్నే పండుకొని రేపు పోదాం" అన్నాడు.
రామయ్య నవ్వి “ఎందుకు రంగయ్యా... అనవసరంగా భయపడతావు. ఈ ఊరిలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడని వుంటాం. ఇద్దరం ఒకరితో ఒకరం మాటలు చెప్పుకుంటూ నడుచుకుంటూ పోతే గంటలో మనింటిలో వుంటాం" అన్నాడు.
దానికి రంగయ్య “చూడు రామయ్యా... ఆ దారిలో చీకటి పడ్డాక దయ్యాలు తిరుగుతూ వుంటాయంట. మనుషులు కనబడితే వదలకుండా వెంటబడతాయంట. నాకు భయం. నేను రాను. అంతగా పోవాలనుకుంటే నువ్వు పో” అన్నాడు.
రంగయ్య వేరే దారిలేక ఒక్కడే ఇంటి దారి పట్టాడు. సగం దూరం పోయేసరికి పన్నెండయ్యింది. చుట్టూ చీకటి. తాను తప్ప మరెవ్వరూ లేరు. దూరంగా నక్కల అరుపులు వినబడుతున్నాయి.
రంగయ్య మాటలు మతికి వచ్చాయి. నిజంగా ఈ దారిలో దయ్యాలున్నాయా, పొరపాటున నిజంగానే వుంటే అవి నన్ను వదులుతాయా లేక.... ఆలోచనలు దయ్యాల చుట్టూ తిరుగుతుండేసరికి నెమ్మదిగా తెలియకుండానే భయం మొదలయింది. పిరికివాడు తాను భయపడడమే గాక ఆ పిరికితనాన్ని పక్కవానికి గూడా అంటించి వెళతాడట.
రంగయ్య పరుగులాంటి నడకతో గబగబగబ పోసాగాడు. ఇంకో అరగంటలో ఊరు చేరొచ్చు. ఊరికి ఒక కిలోమీటరు ముందు సమాధులు ఎదురయ్యాయి. అవి దారి పక్కనే వున్నాయి. అక్కడక్కడా చితులు కాలుతున్నాయి.
మౌనంగా చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటా వెళ్ళసాగాడు. సగం దూరం పోయేసరికి గజ్జెలు ఘల్లుమన్నాయి. రామయ్య అదిరిపడి ఆగిపోయాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. చప్పుడు కూడా రావడం లేదు. మరలా ముందుకు రెండు అడుగులు వేశాడు. “ఘల్... ఘల్...” అని వినబడింది. అదిరిపడ్డాడు . నడక వేగం పెంచాడు. గజ్జెల చప్పుడు కూడా పెరిగింది. "ఘల్... ఘల్... ఘల్... ఘల్...” అంటూ మోగసాగాయి
“దేవుడా... నిజంగానే ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నట్టున్నాయి. అవి దగ్గరకు వచ్చి మీద పడకముందే తప్పించుకోవాలి” అనుకున్నాడు.
వెంటనే ఒక్కసారిగా పరుగు అందుకున్నాడు. గజ్జెల చప్పుడు గూడా అంతే వేగంగా వెంట రాసాగింది. రామయ్య ఎక్కగా పరుగు ఆపలేదు. వేగంగా ఇంటికి వచ్చి చేరాడు. గబగబా తలుపులు తెరిచి లోపల దూరి గడియ పెట్టాడు. అప్పుడు గాని గజ్జెల చప్పుడు ఆగలేదు.
తలుపుకు చెవి పెట్టి విన్నాడు. బైట ఎటువంటి అలికిడి లేదు. “హమ్మయ్య" అనుకున్నాడు. ఆంజనేయస్వామి బొమ్మ తెచ్చి తలుపుకు అడ్డంగా పెట్టాడు. పడుకున్నాడు గానీ నిదుర సరిగా రాలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి కలలు. పొద్దున్నే లేసి బైటకు అడుగు వేశాడు. “ఘల్” మని చప్పుడయింది.
అదిరిపడ్డాడు. రాత్రి వెంబడించిన దయ్యం ఇంకా ఇక్కడే నా కోసం వేచి వుందా, పగటి పూట గూడా వదలటం లేదా అనుకున్నాడు.
భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నోరు తడారిపోయింది. వేగంగా అడుగులు వేశాడు. గజ్జెల చప్పుడు గూడా అంతే వేగంగా రాసాగింది.
అంతలో ఎదురింటిలోని ఐదవ తరగతి పాప ఎదురైంది.
ఆ పాప రంగయ్యను చూసి "ఏం బాబాయి... చెప్పులకు గజ్జెలు తగిలించుకొని తిరుగుతున్నావు. భలేగున్నాయే. సంతలో కొన్నావా" అని నవ్వుతూ అడిగింది.
రంగయ్య అదిరిపడి కిందికి వంగి చూశాడు. చెప్పులకు రెండు గజ్జెలు తగులుకొని కనబడ్డాయి. వాటిని చూడగానే ఫక్కున నవ్వొచ్చింది.
“అరెరే. వీటి చప్పుడు వినా నిన్నటి నుంచి భయపడి సచ్చింది. దయ్యం లేదు. గియ్యం లేదు. చీకటిలో ఈ గజ్జెలు చెప్పులకు గట్టిగా తగులుకున్నట్టున్నాయి. భయం నా ఆలోచనను చంపేసింది. ఇంకెప్పుడూ అనవసరంగా భయపడగూడదు, పిరికివారి మాటలు అస్సలు వినకూడదు" అనుకున్నాడు.
*********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి