సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-770
"అంతే యా మతి స్సా గతి న్యాయము"
   ****
అంతే అనగా అంత్యకాలంలో ,చివరి కాలంలో లేదా మరణించే సమయంలో.యా అనగా పోవుట.మతి అనగా జ్ఞానము,తలంపు,తెలివి, సంకల్పము,హృదయము,విశ్వాసము, అభిప్రాయము, కోరిక, ఉపదేశము,ఆదరము.ఆగతి అనగా రాక,ఆగమనము అనే అర్థాలు ఉన్నాయి.
చనిపోయేటప్పుడు ఏమి తలచుకుంటారో ఆ భావమును,ఆ రూపమును కలిగి తిరిగి జన్మమెత్తుతారు. ఈ విషయమే భగవద్గీతలో"యం యం వాపిస్మరణ్ భావం త్యజ త్యంతే కళేబరమ్ తం త మే నైతి కౌంతేయ సదా తద్భావభావితః"అని చెప్పబడింది.
అనగా "మృత్యు కాలంలో  శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో..ఓ కుంతీ పుత్రుడా! ఎప్పుడూ అదే ధ్యానంలో ఉండటం వలన ఆ వ్యక్తి కూడా అదే స్థితిని పొందుతాడు" అని అర్థము.
 నిత్యజీవితంలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన జీవనశైలిలో జీవిస్తూ వుంటాడు.రోజువారీ అలవాట్లను మనిషి జీవితాంతం వదిలిపెట్టడు.అలాగే  తాను దేనికోసం ఎక్కువగా ప్రాకులాడుతాడో చివరి సమయంలో కూడా  ఆ వ్యక్తికి అవే ఆలోచనలు వుంటాయి. ఆ ఆలోచనల ప్రకారమే తదుపరి జన్మ నిర్ణయించబడుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
 మరి  దానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పురాణ కథ వుంది.అదేమిటో చూద్దామా...
 పూర్వం మన భారతదేశములో భరతుడు అనే రాజు ఉండేవాడు.అతడు చాలా శక్తివంతుడు.భగవంతుని దర్శనం కోసం అప్పటి వరకు ఉన్న రాజ్యాన్ని త్యజి‌స్తాడు.అన్ని వ్యామోహాలను వదిలేసి అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. ఒకరోజు నిండు గర్భంతో ఉన్న ఓ జింక పులి గాండ్రింపు విని భయంతో నీటిలోకి దూకుతుంది.అలా దూకిన జింక ఓ జింక పిల్లను నీటిలోనే  ప్రసవిస్తుంది. నీటిలో  తేలియాడే ఆ చిన్న జింక పిల్లను చూడగానే భరతుడిలో జాలి,కరుణరసం పొంగుతుంది.దానిని రక్షించి తాను నివసిస్తున్న కుటీరానికి తీసుకుని వెళ్తాడు. దానిని పెంచుకోవడం మొదలుపెడతాడు..అలా దానిని ఎంతో ప్రేమతో చూస్తూ దాని ఉల్లాసమైన కదలికలను చూసి ముచ్చటపడేవాడు. దానిని కన్నబిడ్డలా దగ్గరకు తీసుకొని హత్తుకునేవాడు. అలా రోజు రోజుకూ   ఆ జింక పిల్లతో  కాలం గడపడంతో అనుబంధం మరింత బలపడింది.
 ఇలా ఎంత సేపూ జింక పిల్లను గురించిన ఆలోచనలే. భగవంతుని గురించి కూడా పూర్తిగా మర్చిపోయి జింక పిల్ల మీదనే ధ్యాస పెట్టసాగాడు.తాను మరణించే  సమయంలో కూడా ఆ జింక పిల్ల ఎలాబతుకుతుందోనని బాధ పడుతూ దానిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆ తర్వాత ప్రాణాలు వదిలాడు.
 దీని పర్యవసానంగా భరత మహారాజు తదుపరి జన్మలో జింకగా పుడతాడు. అయితే అతడు గత జన్మ చేసిన పుణ్యం, ఆధ్యాత్మిక జీవనము గడిపి ఉండటం వలన తాను చేసిన తప్ఫుమ గ్రహించగలిగాడు. జింక  రూపం ఉన్నప్పటికీ సజ్జనుల సాంగత్యము ,ఆశ్రమాల వద్ద నివసించడం వలన ఈ సారి మరణించినప్పుడు మళ్ళీ మానవ రూపం ఎత్తుతాడు.మహా ఋషి జడభరతుడిగా పేరు పొందాడు.
 ఇందులోని అంతరార్థం ఏమిటంటే  మనిషి అవసాన దశలో దేనిమీద ప్రేమా ఆసక్తి ఉంటే దాన్ని బట్టి ఈ జన్మ వుంటుంది అనేది మనం తెలుసుకోవలసిన విషయం.
 ఎప్పుడో చివరి దశలో కృష్ణా రామా అనుకోకుండా ముందు నుంచే  భగవంతుని పట్ల ఆసక్తి, పెంచుకోవాలి.ప్రతిక్షణం  ఆయనను తలపులలో నింపుకోవాలి అంటారు భగవద్భక్తులు.
మానవీయ జీవన విధానం తెలిసిన మనిషిగా పరోపకార పనులు చేస్తూ, ఇష్టమైన పనిని దైవాన్ని స్మరిస్తూ ఉంటే తృప్తి, సంతృప్తి జీవన్ముక్తి కలుగుతాయి. ఇదండీ!ఈ అంతే యా మతిస్సా గతి న్యాయము లోని అంతరార్థము. దీనిని తెలుసుకున్న మనం పువ్వులా, చెట్ఠులా జీవిద్దాం. మళ్ళీ మళ్ళీ  మంచి జన్మ ఎత్తుదాం.

కామెంట్‌లు