సుప్రభాత కవిత : - బృంద
తుషారంలో విరిసే పువ్వుల 
హుషారు చూడగా తలచి 
నిశా సుందరికి వీడ్కోలు చెబుతూ 
ఉషస్సు పరిచె వెలుగుల తివాచీ 

వెలుతురు దోచేయాలని 
వెండిమబ్బుల పరుగులు 
దొరకక కందిన ముఖాలతో ఎర్రబారి 
ఏకమై నిలిచిన మేఘమాలలు 

నింగిని జరిగే సందడి చూసి 
నిండుగా నవ్వుతూ...
రెండు చేతులూ చాచి స్వాగతించే 
పొంగిన ఆనందాన కొండ  కోనలు.

తెల్లారి గాలికి  ఊగే  కొమ్మలు 
అల్లాడి గొంతు కలిపే చిన్ని ఆకులు 
అప్పుడే విచ్చిన కొత్త మొగ్గలు 
అన్నిటి చూపు తూరుపు వైపే!

నిన్న జరగని వింత ఏదో
నేడు విందుగా కనపడునని 
రేపటి కోసం ఎదురుచూచిన 
చీకటి రేయికి దొరికిన కానుకగా..

నభమున ఒలికిన జ్యోతి కలశం 
జగతిని వెలిగించు కాంతి కిరణం 
కాలచక్రపు మరొక ఆవృతం 
దైవం ఒసగిన అద్భుత అవకాశానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు