న్యాయములు-779
""అల్ప విద్యో మహాగర్వీ న్యాయము
*****
అల్ప అనగా తుచ్ఛమైనది, ముఖ్యము కానిది, కొంచెము,సూక్ష్మము. విద్య అనగా చదువు.మహా అనగా పెద్ద, గొప్ప, విస్తృతమైన, ఉన్నతమైన, బలిసిన, అత్యధికము, అత్యంతము.గర్వి అనగా గర్వించు,గర్వః అనగా గర్వము, పొగరు అనే అర్థాలు ఉన్నాయి.
కొంచెము విద్య గలవానికి గర్వము ఎక్కువ అని అర్థము.
మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరు వ్యక్తులు మనకు తారసపడుతూ వుంటారుఅయఝః కాగా. తెలిసింది కొంతే అయినా తమకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అన్నట్లుగా చాలా గర్వంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ న్యాయము ఉదాహరణగా చెప్పబడింది.
దీనికి సంబంధించిన భర్తృహరి నీతి శతకం లోని ఓ పద్యాన్ని చూద్దామా...
"యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాన్ధః సమభవం/తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః!యదా కించిత్కించిద్బుధజన సంకాశాదవగతం!తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః!!"
అనగా నేను ఎప్పుడు కొంచెమే తెలిసిఉండినప్పుడు గర్వముతో కళ్ళు తెలియని వాడనై మదించిన ఏనుగు వలె నాకే అన్నీ తెలుసును అనుకుని, సర్వజ్ఞుడను అనుకుంటూ ఉండే వాడిని.
విద్యాధికుల సాంగత్యం వలన ఎప్పుడైతే నాకు కొంచెం కొంచెంగా విషయ జ్ఞానం అవగతమవుతూ ఉన్నదో, అప్పుడు నాకు అర్థమౌతూ ఉన్నది.నేను ఎంత అవివేకినో అనే సంగతి.ఎంత మూర్ఖుడనో అనే విషయం తెలిసిన కొద్దీ ఆ భావన చేత జ్వరము పోయి సుఖపడినట్లు నన్ను పట్టియున్న గర్వము పోయి సుఖ పడితిని." అని ఒక మారిన వ్యక్తి యొక్క స్వగతం ఇది.
దీనినే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చంపకమాలగా రాసిన సుభాషిత పద్యాన్ని చూద్దాం.
"తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్/ తెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి యిపుడు/ జ్వల మౌతులైన పండితుల సన్నిధి నించుక బోధ శాలినై/ తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యెనితాంత గర్వమున్. "
అనగా విజ్ఞాన వంతులైన పండితుల సాంగత్యం వలన మెల్ల మెల్లగా విషయపరిజ్ఞానము ద్వారా అజ్ఞానాంధకారములు విడివడి జ్ఞాన సముపార్జన జరుగుతుంది.అట్టి జ్ఞాన సముపార్జనతో మనకు తెలిసినది ఎంత తక్కవో తెలియవలసినది ఇంకా ఎంతగా ఉన్నదో అవగతమవడం వలన మనిషికి అణకువ, మర్యాదలు అలవాటు అవుతాయి. జ్ఞానం పెంపొందించుకుంటున్న కొలదీ మనకు అవగతమవుతుంది.విద్యాధికుల ముందు మనం ఎంతటి అల్పులమో అనే విషయం తెలుస్తుంది.అప్పుడు మనం ఒదిగి ఉండటం నేర్చుకుంటాము.లేనిచో మనమే సర్వజ్ఞులము అనే అజ్ఞాతంతో విర్రవీగుతూ ఉంటాము.అనగా ప్రతి మనిషి విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలి.సజ్జన సాంగత్యం,బుధ జనులు యొక్క సాంగత్యముల ఆవశ్యకతను ఈ సుభాషితం తెలియజేస్తున్నది.
మిడి మిడి జ్ఞానంతో మిడిసిపడే వారిని ఉద్దేశించి తెలుగులో చాలానే సామెతలు ఉన్నాయి." అన్ని ఉన్న విస్తరాకు అణిగి మనిగి ఉంటుంది - ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది" అంటారు. అంటే అరకొర విద్యా జ్ఞానం ఉన్న వ్యక్తి అతిగా ప్రవర్తిస్తాడని అర్థం.
అందుకే "అల్ప విద్యో మహాగర్వీ" అన్నారు. దీనినే వేమన మూడే మూడు వాక్యాల్లో తేల్చి పడేశాడు. "అల్పడెపుడు పల్కు ఆడంబరముగాను/ సజ్జనుండు పల్కు చల్లగాను/కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినురవేమ!"
కొంచెం విద్యకే సర్వజ్ఞుడను అని భావించే వాడిని కంచుతో పోల్చాడు వేమన.తనేదో చాలా గొప్ప అని కంచులా మోగుతూ వాగుతుంటాడు.కానీ సజ్జనుడు సర్వజ్ఞుడైన వాడు తనకు ఎంతగా తెలిసినా బంగారం వలె చప్పుడు చేయకుండా తన మేధో కాంతితో పచ్చగా మెరిసిపోతుంటాడు. సజ్జనుడైన విద్యావంతుడి మాట తీరు వ్యవహార దక్షత బంగారం వలె చప్పుడు చేయకుండా ఉంటుంది. ఇలా మానవ నైజాన్ని ఇలా పోల్చి చెప్పాడు.
మొదట్లో తెలిసీ తెలియనితనంతో అహాన్ని ప్రదర్శించినా స్వర్ణంలాంటి సజ్జనుల సాంగత్యముతో అహాన్ని వదిలిపెడితే ఎవరైనా సరే అందరి మన్ననలను ఆత్మీయతా అభిమాన ధనాన్ని నిండుగా, మెండుగా పొందగలమని చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
"అల్ప విద్యో మహాగర్వీ"అనే న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెప్పడానికి గల కారణాలను తెలుసుకున్న మనం ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తరువే మన గురువుకావాలి.సమున్నతంగా ఎదిగి విద్యా వివేక ఫలాలను సమాజానికి అందిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి