నీ జీవితం నీ ఇష్టం :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆకాశానికి
ఎగురుతావో
పాతాళానికి
జారుతావో నీ ఇష్టం

పూలబాటన
పయనిస్తావో
ముళ్ళదారిన
నడుస్తావో నీ ఇష్టం

ముందుకు
వెళతావో
వెనుకకు
మళ్ళుతావో నీ ఇష్టం

వెలుగులు
వెదజల్లుతావో
చీకట్లు
చిమ్ముతావో నీ ఇష్టం

శిఖరాన్ని
ఎక్కుతావో
లోయలోకి
దిగుతావో నీ ఇష్టం

పల్లకిలో
తిరుగుతావో
బోయీవై
మోస్తావో నీ ఇష్టం

ఉయ్యాలనెక్కి
ఊగుతావో
జంపాలనుపట్టి
ఊపుతావో నీ ఇష్టం

అవకాశాలను
వాడుకుంటావో
అందినవాటిని
వదులుకుంటావో నీ ఇష్టం

రత్నాలను
ఏరుకుంటావో
రాళ్ళతట్టను
ఎత్తుకుంటావో నీ ఇష్టం

తలరాతలను
మార్చుతావో
నీటిరాతలను
నమ్ముతావో నీ ఇష్టం

లాభాలను
పొందుతావో
నష్టాలను
భరిస్తావో నీ ఇష్టం

అందాలను 
ఆస్వాదిస్తావో 
ఆనందాలను 
అనుభవిస్తావో నీ ఇష్టం 

నీ తెలివి
నీ తలలోనే ఉన్నది
నీ కలిమి
నీ చేతలలోనే ఉన్నది

నీ భవిత
నీ చేతిలోనే ఉన్నది
నీ ఘనత
నీ చేష్టలలోనే ఉన్నది

ఆలశ్యంచేస్తే  
అమృతమవుతుంది విషం
తక్షణమే 
ఆరంభించు నీ ప్రయత్నం

నిన్ను 
నమ్ముకోవటము నీకు అవసరం  
నిన్ను 
ఉద్ధరించుకోవటం నీకు ముఖ్యం 

నీ కోసం
నువ్వు శ్రమించు
నీ ఆశయం
నువ్వు సాధించు

నీ జీవితం
నీ ఇష్టానుసారం
నీ విజయం
నీ కష్టాలఫలం


కామెంట్‌లు