ఇలాతలాన వాలి
ఇంపైన పదాలతో
కవనాలు రచించె
కిరణాల కలాలతో రవి!
ఆ కవిత గగనాన
అందంగా ప్రతిబింబింప
మబ్బుల మాటున దాగె
ఆత్రంగా చదువుకోగా నింగి!
అల అంబరాన సంబరము
ఇల భువిపైన కోలాహలము
కని కలకల నవ్వి మురిసె
కర్మసాక్షిని చూసి నదిలోని నీరు!
వెలుగుల వానలో తడిసి
వెలుతురు వేడిలో కరిగి
కదలక కూచున్నవేమో
దరిని వరుసగా శిలలు!
ఒడ్డున పెరిగిన పచ్చని
గడ్డిలో ముచ్చటగా విచ్చి
పుత్తడి వెలుగులు సోకి
పసిడి నవ్వులు రువ్వే పువ్వులు!
సుందరమైన ప్రకృతిలో
అడుగుకో అందం
అణువణువూ చైతన్యం
అంతరంగాలకు ఉత్సాహం నింపే
ఉషా కిరణాలకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి