నిజమైన సంపద!:- - బోగా పురుషోత్తం, తుంబూరు.

 హేలాపురిని హేమసుందరం పాలించేవాడు. అతని ఆస్థానంలో కవులు, పండితులు చాలామంది వుండేవారు. నిత్యం వారితో సాహితీ సభలు,  సమావేశాలు నిర్వహిస్తూ వారి వద్ద  పొగడ్తలు పొందుతూ  సుపరిపాలకుడని ఉప్పొంగిపోయేవాడు. తాను సాహితీ వల్లభుడని తన వద్ద సాహితీ సంపద వుందని అది తనను అన్ని విధాలా ఆదుకుంటుందని భావించేవాడు.
  ఓ సారి వర్షాకాలంలో హేలాపురిని కలరా పట్టి పీడిరచింది. కవులు, పండితులు ప్రాణాలు కోల్పోసాగారు.  ఇప్పుడు సాహితీ సమావేశాలు లేక రాజ ఆస్థానం వెలవెలపోయింది.  అంతకంతకూ ఉధృతమవుతున్న కలరాను అదుపు చేయడం రాజు తరం కాలేదు.  రాజు సైతం చివరకు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో  మంత్రి మల్లేశం మంచి నిర్ణయం తీసుకున్నాడు.  పక్క రాజ్యాధిపతిని సంప్రదించి గొప్ప వైద్యులను రప్పించాడు.  మంచి వైద్యం అందించడంతో కలరా అదుపులోకి వచ్చింది. అందరి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ పరిణామంతో రాజు సాహిత్య రంగమే తనను ఆదుకోజాలదని గుర్తించాడు.
   కొద్ది రోజుల తర్వాత ఓ వింత వ్యాజ్యం ఎదురైంది. తీర్పు చెప్పలేక బుర్రగోక్కుని తికమకపడ్డాడు. విధిలేక పొరుగు రాజ్యంలో వున్న న్యాయాధిపతులను రప్పించాడు.
  ఓ నిరుపేద తినడానికి తిండి లేకపోయినా నల్గురు భార్యలను వివాహం చేసుకున్నాడు. పది మంది సంతానం కలగడంతో వివాదం తన వద్దకు వచ్చింది.  ఎవరికి న్యాయం చేయాలో తెలియక పర దేశ న్యాయాధిపతులతో సరైన తీర్పు ఇప్పించి ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు.
     రాజ్యంలో వున్న సమస్యలన్నిటినీ ఒక్క సాహితీ సంపద మాత్రమే ఆదుకోదని గ్రహించాడు.  రాజ్యంలో అన్ని రంగాల విద్య వుంటేనే ప్రయోజకనకరమని భావించాడు. అన్ని రంగాల విద్యలనూ అభివృద్ధి చేయడమే నిజమైన సంపద అని గ్రహించి  అన్ని రంగాల విద్యలతో పాటూ సాహితీ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ సరికొత్త విద్యా విధానం అమలు చేశాడు.  అన్ని రంగాల నిష్ణాతులు రూపొందడంతో రాజ్యంలో ఏ సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించసాగాడు రాజు హేమసుందరం.

కామెంట్‌లు