కనువిప్పు : సరికొండ శ్రీనివాసరాజు
 విజయనగర ఉన్నత పాఠశాలలో శ్రావణి  మరియు స్రవంతి 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఆ తరగతిలో బాగా తెలివైన విద్యార్థులు. ఇద్దరూ క్లాస్ ఫస్ట్ వచ్చేవారు. కానీ ఇద్దరికీ ఒక్కరంటే మరొకరికి బీభత్సమైన ఈర్ష్యా భావం ఉండేది. అస్సలు ఒకరితో మరొకరు మాట్లాడుకోక పోయేవారు. వారిద్దరినీ కలపాలని ప్రయత్నించిన వారంతా విఫలం అయ్యారు.
      మాలిని అనే అమ్మాయి శ్రావణి వద్దకు వెళ్ళి, "చూశావా శ్రావణి! ఆ స్రవంతి నీ గురించి అందరికీ చెడుగా ప్రచారం చేస్తుంది. ఛీ! దాని స్వభావం అస్సలు మంచిది కాదు. దానికి బుధ్ధి చెప్పాలి." అన్నది. "సరే! నాతో పాటు కలసి చదువుకో. ఇద్దరం కలిసి ఎక్కువ మార్కులు సాధించి, ఆమెకు బుద్ధి చెబుదామా?" అన్నది. మాలిని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మాలిని స్రవంతి వద్దకు వెళ్ళి, "చూశావా స్రవంతీ! ఆ శ్రావణి నీ గురించి అందిరికీ చెడుగా చెబుతుంది. నువ్వు పరీక్షలలో కాపీ కొడతావట. అందుకే ఎప్పుడూ ఫస్ట్ వస్తావట." అన్నది. "మరి నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి?" అన్నది. నోరు మూసుకుంది మాలిని.   "ఓ మంథరా? ఇలాంటి వార్తలతో విలువైన సమయాన్ని వృథా చేయకుండా చక్కగా చదువుకో." అన్నది స్రవంతి. మాలిని ముఖం మాడ్చుకొని పోయింది.
         10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థి లేచి మాటాడుతున్నారు. ఇప్పుడు శ్రావణి వంతు వచ్చింది. శ్రావణి మాట్లాడుతూ, "నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే స్రవంతే." అన్నది. స్రవంతి ఆశ్చర్యపోయింది. ఖంగు తిన్నది. "స్రవంతి మీద ఈర్ష్యా భావంతో ఎప్పుడూ స్రవంతి మీద గెలవాలని పట్టుదలతో చదువులో మంచి స్థానంలో ఉన్నా. స్రవంతి లేకపోతే ఇంత తెలివైన శ్రావణి లేదు. చదువులో పోటీ మంచిదే.కానీ ఒకరి పట్ల మరొకరు ఈర్ష్యా భావంతో ఉండకుండా స్నేహ భావంతో ఉంటే ఒకరిని మరొకరు ప్రొత్సహించుకుంటూ మరింత ఉన్నత స్థానంలో ఉంటారు. ఇన్నాళ్ళు స్రవంతిని శత్రువులా భావించాను. కానీ నా ఆలోచన తప్పు. స్రవంతి మూలంగా నేను చదువులో ఈ స్థానంలో ఉన్నా. స్రవంతి నా శత్రువు కాదు. స్రవంతి నా బెస్ట్ ఫ్రెండ్." అన్నది శ్రావణి. కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యింది స్రవంతి. శ్రావణి మీద పడి చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది స్రవంతి. మాలిని ముఖం మాడ్చుకుంది. "అవును మనిద్దరం ఈర్ష్యతో చాలా మంచి మెమరీస్ మిస్సయ్యాం. ఇక నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్." అన్నది స్రవంతి. 

కామెంట్‌లు