పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా స్మశానంచేరి,తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధీంచి భుజంపైన చెర్చుకుని మౌనంగా స్మశానంనుండి బయలుదేరాడు.
" మహిపాలా అనన్య ప్రతిభావంతుడవు అయిన నీపట్టుదల మెచ్చదగినదే! 'విక్రమార్క మహరాజా నీవు సకల కళావల్లభుడవు,అయిన నీవు ఈలోకంలోని నీగుణగణాలను ధైర్యసాహసాలు,దానగుణశీలతగురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.అంతటిఘనుడవు అయిన నీకుమనం వెళ్లేదారిలో ప్రయాణ అలసట తెలియకుండా నిజమైన సంగీత ప్రేమికులు కథచెపుతానువినను......
భువనగిరిని రాజ్యాన్ని పాలించే గుణశేఖరునికి కళలపట్ల అమిత అభిమానం. ప్రతిసంవత్సరం మూడురోజులు జరిగే సంక్రాంతి వేడుకల్లో పలుకళాకారులు తమ తమ కళలలోని ప్రావీణ్యతను ప్రదర్శించి రాజుగారి మెప్పుపొంది ఆయనఇచ్చే బహుమతులు స్వీకరించి వెళ్ళేవారు.
ఎప్పటిలా ఆసంవత్సరం సంక్రాంతి వేడుకలలో ఎందరో కవిగాయకులు పాల్లొన్నారు.పోటాపోటీగా సాగే ఆ సంగీత గాయకుల గానానికీ సంగీత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆనంద పరవశులై తాళానికి అనుగుణంగా తల ఆడించసాగారు. అదిచూసి అసలు సంగీత పరిజ్ఞానం లేనివారుకూడా తమ తలలు ఇష్టానుసారంగా ఊపసాగారు.ఆసంగీత సభలో ఉన్నవారు ఒకరు తల అటుపక్కకి ఊపితే మరొకరు తమతలను ఇటు పక్కకు ఊపసాగారు. సంగీత సభలోనివారు ఆనందించి తల ఊపినట్లులేదు పూనకం వచ్చినట్లు ఊగిపోసాగారు. స్వతహగా సంగీత విద్వాంసుడు అయిన రాజుగారికి సభలోనివారు సంగీతాన్ని ఆస్వాదిస్తూ తలలు ఊపినట్లు లేకపోవడంతో చిరాకు పెట్టింది.తనమంత్రితో ఈతలలు ఊపేవిషయంలో తన అసహనాన్ని తెలియజేసాడు రాజు.
మరుదినం సంగీత సభ ప్రారంలో ," సభాసదులారా,సంగీతప్రేమికులారా ఈనాటి సంగీత సభలో ఎవరైనా తలఊపితే వారితల తెగవేయబడుతుంది ఇది రాజ్ఞా" అన్నాడు మంత్రి . ఆరోజు సంగీత సభలోని శ్రోతలు చాలావరకు వెళ్ళిపోయారు .
సంగీత సభప్రారంభమైన కొద్దిసేపటికి సభలో శ్రోతలుగా ఉన్నముగ్గురు వ్యక్తులు గాయకుని గానానికి అనుగుణంగా తలలు ఆడించసాగారు.
సభానంతరం రాజుగారు ఆశ్రోతలను సత్కరించాడు.
" విక్రమార్కమహరాజా మంత్రి తలలు ఊపితే మరణశిక్ష అన్నప్పటికి మహరాజు ఆముగ్గురుశ్రోతలను ఎందుకు సత్కరించాడు?తెలిసి సమాధానం చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు "అన్నాడు.
" బేతాళా మంత్రి ప్రకటించిన మరణశిక్షకు భయపడకుండా ఆశ్రోతలు సభలోని సంగీత ప్రతిభకు తన్మయానందంపొంది ఆగానానికి అనుగుణంగా తలలు ఊపారు. వీరే నిజమైన సంగీత ప్రేమికులు. అదిచూసి ఆనందించిన మహరాజు ఆముగ్గురిని సత్కరించాడు" అన్నాడు
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
నిజమైన సంగీత ప్రేమికులు . కల్పిత బేతాళకథ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .-9884429899
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి