ఆకాశం అత్తగారిల్లు
భూమి పుట్టిల్లు నీకు
మేఘాలను కట్టుకొని
అంబరాన సంసారం సాగిస్తావు
ఆవిరిగా అత్తారింటికి చేరుతావు
మేఘాల దాహాన్ని తీరుస్తావు
అలసి సొలసి చల్లబడి
పుడమి తల్లిని చేరగవస్తావు
ఏడాదికోసారి గగనతలం జారీ
నేలను ఆలింగనం చేసుకుంటావు
దివికి-భువికి నిరంతరం ప్రయాణించే
అనాది అంతరిక్ష యాత్రివి
ఆవరణానికి నిలువుటద్దానివి
నింగి లోని సందమామ సైతం
నీలో తన ముఖం చూసుకొని
అందానికి మురిసిపోతుంది
నీ నీలం నింగికి అద్దినావా లేక
నింగి రంగు నీవు పుచ్చుకున్నావా
లేకుంటే...
ఏ రంగూ లేని నీటి చుక్కకు
నీలి రంగు ఏమిటో...
ప్రశాతంగా కనిపించే నీలో
నిలకడ లేని తనం ఏమిటో...
ప్రాణాలు పోసే నీలో
ఉసురు తీసే ఉధృతి ఏమిటో..
ముఖమే లేని నీలో
గలగల సంగీతం ఏమిటో...
తాపాలకు అనుకూలంగా
వేషాలు మార్చుకోగల బైరూపివి
పాత్రకు తగ్గట్లు ఒదిగి పోయే
విశ్వ మహా నటివి
పంచభూతాలలో ఒకటైన నీవు
శక్తి రూపాలు మార్చుకోగలవు
స్థితిశక్తివి విద్యుచ్ఛక్తిగా మారే
ఆది పరాశక్తి రూపిణీవి
నీ అనంత శక్తిలో గోరంతకే
భూలోకం దేదీప్యమయ్యింది
నిన్ను రక్షించుకుంటే
మాకు రక్షఅవుతుంది
(మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి