సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-794
"ఆదానం హి విసర్గాయ సతాం వారిముచా మివ" న్యాయము
****
ఆదానం అనగా  తీసుకోవడం,స్వీకరించడం,అంగీకరించడం లేదా స్వాధీనం చేసుకోవడం. విసర్గాయ అనగా బయటకు పంపడం,విడుదల చేయడం.సతాం అనగా నిజమైన  మిత్రుడు కాకపోవడం.రెండు ముఖాల వ్యక్తి అని కూడా అంటాం. వారి అనగా నీరు.ముచా అనగా వదులు చేయుట, విడిచి పెట్టుట,స్వతంత్రము చేయుట,ఇచ్చుట. మివ అనగా వలె అని అర్థము.
"భూమి మీద వర్షం కురిపింఛడానికి మేఘములు నీటిని చేర్చుకుంటాయి.అలాగే సత్పురుషులు కూడా ఇతరులకు దానము చేయడానికే ధనమును కూడబెడతారు" అని అర్థము.
ఇక్కడ సత్పురుషులను మేఘాలతో పోల్చడం జరిగింది. మేఘాలు ఏ విధంగానైతే తమ వద్ద నీళ్ళు లేకపోయినా సముద్రం నుండి తీసుకుని వచ్చి వర్ష రూపంలో ఇచ్చినట్టు, సత్పురుషులు కూడా తమ వద్ద లేకపోయినా ఎలాగోలా ఇతరుల దగ్గర నుండి తీసుకుని వచ్చైనా సరే సహాయం / పరోపకారం చేస్తారు.
పరోపకారం అంటే వ్యక్తిగత ప్రయోజనం లేదా పరస్పర సంబంధం లేకుండా ఇతరుల శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించడమే పరోపకారం.
ఇదే విషయాన్ని భాస్కర శతక కర్త ఎంత చక్కగా మనసులో నాటుకునేలా చెప్పాడో చూద్దాం.
"దానము సేయ గోరిన వదాన్యు కీయగ శక్తి లేనిచో/ నైన బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ/బూనును మేఘుడంబుధికి బోయి జలంబుల దెచ్చి యీయడే/ వాన సమస్త జీవులకు వాంఛిత మింపెనలార భాస్కరా!"
అనగా "దాత యగు వ్యక్తి/ ఇతరులకు సహాయం చేయవలెననుకునే పరోపకారి తన దగ్గర ధనము లేకున్ననూ మబ్బు సముద్రము నుండి నీరు తీసుకుని సమస్త జీవులకు కావలసిన విధంగా వాన రూపంలో కురిసినట్లు, దాత కూడా  ఏదో ఒక విధంగా ఇతరుల నుండి యైనను ధనము తెచ్చి దానము చేయును".
 మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కాబట్టి పరోపకారికి అంతా మంచే జరుగుతుందని , ఎవరి హృదయమైతే పరుల హితాన్ని కోరుకుంటూ ఉంటుందో అలాంటి వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాస్ అంటాడు. ఇదే విషయం గురించి స్కాంద పురాణంలో ఇలా చెప్పబడింది.
"పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతాం/ నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే/తీర్థస్నానైర్న సా శుద్ధిర్భహుదానైర్న తత్ఫలమ్/తపోభిరుగ్రైస్తన్యాప్య మువకృత్యా యదాప్యతే!/
"అనగా ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి.సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు.అందువల్ల  కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.'
ఇతరులకు సహాయం చేయాలనుకున్న మంచి వారికి ఎల్లప్పుడూ మనసులో పరోపకార భావన నిండి ఉంటుంది.అలాంటి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
 కాబట్టి  అశాశ్వతమైన ఈ జీవితం సార్ధకం కావాలంటే కొంతైనా పరోపకారం చేయాలి. దాని వల్ల ఆత్మ తృప్తి, ఆనందం కలుగుతాయి.

కామెంట్‌లు