యురవే ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం

 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రం రైతుబజార్ వద్ద గల విద్యాలయ ఆవరణలో ఘనంగా కవిసమ్మేళనం నిర్వహించినట్లు యువ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ తెలిపారు. ఆమె అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో ప్రముఖ సాహితీవేత్తలు హాజరై కవితలు వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన కుదమ తిరుమలరావు మాట్లాడుతూ కవితలు సామాజిక బాధ్యతను నిర్దేశించేలా ఉండాలని అన్నారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన జంధ్యాల  శరత్ బాబు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి, తేనెలొలుకు తెలుగు పలుకులు కవితల ద్వారా రసానుభూతి కలిగిస్తాయని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన యువ రచయిత్రి పొట్నూరు మాలతి మాట్లాడుతూ చైతన్యం రగిలించి, పరిస్థితుల పట్ల అవగాహన పెంచేందుకు కవితలు తోడ్పడతాయని  అన్నారు.  
అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో తంగి ఎర్రమ్మ, కుదమ తిరుమలరావు, జంధ్యాల  శరత్ బాబు, పొట్నూరు మాలతి,  గుడిమెట్ల గోపాలకృష్ణ, బగాది వెంకటరావు, ఆనెం భాస్కరరావు, పేడాడ వేదవతి, కరకవలస వాసవి, బలివాడ ధనుంజయరావు, చింతాడ రామచంద్రరావు, మండల గణస్వామి, ఐ.సి.హెచ్.వి.కె. భాస్కరరావు, కిల్లాన శ్రీనివాసరావులు తమ కవితలు రాగయుక్తంగా ఆలపించి వినిపించారు. ఈ కవితలలో పలు అంశాలు అందరినీ ఎంతగానో ఆలోచింపజేశాయి. కవి సమ్మేళనం 
సమన్వయకర్త తంగి ఎర్రమ్మ మాట్లాడుతూ యువ రచయితల వేదిక స్థాపించిన పిదప ఇది ఐదో సమావేశమని అన్నారు. యువ చైతన్యం, భాషాభిమానం, సమాజ శ్రేయస్సు, విజ్ఞాన అంశాలపై అధ్యయనం వంటి ఆశయాలతో ఈ 'యురవే' ని మరింతగా విస్తృత పరుస్తామని అన్నారు. సాహితీ అభిమానులను 'యురవే' ఎల్లప్పుడూ గౌరవిస్తూ స్వాగతిస్తుందని అన్నారు.
కామెంట్‌లు