సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-820
"అశ్వారూఢాః కథం చాశ్వాన్ విస్మరేయుఃసచేతనాః" న్యాయము
******
అశ్వారూఢాః అనగా గుఱ్ఱముపై అధిరోహించిన వారు.కథాం చాశ్వాన్ ఏవిధంగానైనా గుఱ్ఱము ఎక్కినది విస్మరేయుః అనగా మఱచి పోవుదురా?. సచేతనాః అనగా చేతనత్వంతో ఉండి అని అర్థము.
"గుఱ్ఱము నెక్కిన వారు సచేతనులై యుండి తా మెక్కిన గుఱ్ఱము నెట్లు మఱచి పోవుదురు?" అట్లు మఱచిపోవుట ఆత్మ వంచన అవుతుంది.
ఎవరైనా సరే తమ పని తాము చేస్తున్న సమయంలో వారి అంతర్గత మానసిక లేదా ఆధ్యాత్మిక వాస్తవం యొక్క అవగాహన కలిగి ఉండాలి.
అలా లేరు అంటే వారిలో ఏదో మానసిక  లోపం వుండవచ్చు.
తత్వ వేత్తలు స్పృహ అనే పదాన్ని నాలుగు ప్రధాన అంశాలకు ఉపయోగించారు. సాధారణంగా జ్ఞానము, ఉద్ధేశ్యత, ఆత్మ పరిశీలన మరియు అసాధారణ అనుభవము.ఎవరి మనసులోనిది వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే అది ఆత్మ పరిశీలనా స్పృహ కలిగి ఉండటం అన్నమాట.ఒక అనుభవం లేదా ఇతర మానసిక అస్తిత్వం అద్భుతంగా స్పృహ కలిగి ఉంటుంది.
 ప్రతి ఒక్కరూ తన అంతర్గత అనుభవానికి చెందిన వారు అని నిర్థారించుకునే మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన కాంక్రీటు వాస్తవం ఏమిటంటే ఏదో ఒక రకమైన స్పృహ కొనసాగుతుందనే వాస్తవం. ఆత్మ పరిశీలన అనేది మనస్సు తనను తాను చూసుకోవడం.
 దీనికి మరో ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే కళ్ళు విశ్వం మొత్తాన్ని చూడగలవు కానీ తమను తాము చూసుకోలేవు.అయితే అదే కన్ను తాను చూడగలిగే కన్ను ద్వారానే తన ఉనికిని తాను ఊహించుకోగలదు.ఇదే తన ఉనికిని తాను తెలుసుకోవడం.
ఏదైనా విషయం, వ్యక్తి లేదా పరిస్థితి గురించి తెలుసుకోవడం గ్రహించడం, స్పష్టంగా అవగాహన కలిగి వుండటం మరియు దానిపై స్పందించగలగడం అనేదే సచేతనత్వం.వ్యక్తి ఏదైనా చేస్తున్నాడు అంటే సచేతనత్వం కలిగి ఉన్నాడని అర్థము.
కాబట్టి గుఱ్ఱము ఎక్కి స్వారీ చేస్తూ తాము ఎక్కిన గుఱ్ఱము గురించి ఎలా మరిచిపోతారు. అలా మరిచిపోయాము అని చెప్పడం ఆత్మ వంచన లేదా ఇతరులను మోసగించేందుకు చెప్పడం. కాబట్టి ఇలాంటి వారిని,వారి మాటలను నమ్మకూడదు అని అర్థము.
అలాగే  "వేద ప్రమాణత్వమును దృవీకరింప బోయి తానే వేదమున కప్రామాణ్యము ప్రతిపాదించుచు తన వాదమును తప్పినట్లు.అనగా  వేదము గొప్ప తనం తెలిసిన వ్యక్తి వేదాన్ని తప్పుగా ప్రతిపాదిస్తూ ఉన్నాడంటే అతడు కావాలనే తన వాదమును తప్పు త్రోవ పట్టిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు."
 మొత్తంగా ఈ న్యాయమును నిశితంగా పరిశీలించి చూస్తే మనకు తెలిసేది ఏమిటంటే  ఎవరో కొందరు అజ్ఞానంతో ప్రవర్తించడం వేరు. వారికి రకరకాల మానసిక సమస్యలు ఉండవచ్చు కానీ. అన్నీ సవ్యంగా ఉండి కూడా తప్పుగా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అది కావాలని చేసేదే.. అందుకే అలాంటి వారిని నమ్మకూడదు అని చెప్పడానికి ఈ "అశ్వారూఢాః కథం చాశ్వాన్  విస్మరేయుః" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 లోకంలో రకరకాల మనుషులు వారి మనస్తత్వాలు ఈ విధంగా ఉంటాయని మనం సదా గమనంలో ఉంచుకోవాలి.

కామెంట్‌లు