తీపి ఆటవెలది.
తీపి బాససేసి తీరుగా వంచించి
గొంతు కోసి ప్రజల కుర్చినెక్కి
నిధుల దోచి దాచు నికృష్ట నేతలన్
విలయమందు ముంచు విశ్వ వసువ!
పులుపు ఆటవెలది.
చింత చచ్చి పులుపు చిరమయ్యి రేగుచుఁ
గంట పడిన యెదుటి కాంతఁ గోరి
వరుస వావి లేకఁ జెఱచు నీచులఁ బట్టి
విలయమందు ముంచు విశ్వ వసువ!
ఉప్పు ఆటవెలది.
ఉప్పు తిన్న యింటి ముప్పుకోరుచు వార్కి
కస్తిఁ చేయు కపట కావరులకు
నుప్పు పుట్టకుండ నూర్లేగునట్లుగా
విలయమందు ముంచు విశ్వ వసువ!
కారపు ఆటవెలది.
కపటబుద్ధి తోడ కండ్ల కారముఁగొట్టి
పరుల ధనము దోచి బతుకువార్ని
తిండి దొరకకుండ తిరిపెగొట్టులఁ జేసి
విలయమందు ముంచు విశ్వ వసువ!
చేదు ఆటవెలది.
చేదు నిజము దాపి యూదరంగొట్టుచున్
చెడును గొప్ప పనిగ చెప్తు యువతఁ
జెఱుపు నేటి చలన చిత్రవీరులఁ గూల్చి
విలయమందు ముంచు విశ్వ వసువ!
వగరు ఆటవెలది.
వగరునందు కలదు వంచించు లక్షణము
పచ్చి జామపండుఁ బరగనుండు
తినగఁబోగ గొంతు దిగదెంతమాత్రము
విశ్వ వసువ! దాని విషమునణచు
===============================
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం
కరీంనగరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి