న్యాయములు-809
"అనిషిద్ధ మనుమతమ్" న్యాయము
*****
అనిషిద్ధ అనగా నిషిద్ధం కాని, నిషేధింపబడనిది.మనుమతమ్ అంటే అంగీకరించబడినట్లే అని అర్థము.
"నిషేధింపబడనిది అంగీకరించబడినట్లే" అని అర్థము.అంటే ఆంగ్లంలో "Silence gives consent" అనగా "మౌనం అంగీకార సూచకమనునట్లు."
మౌనం అంగీకార సూచకంగా భావించడం అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది.ఏదైనా విషయానికి వస్తే దానిని బలపరచడానికో, బలహీన పరచటానికో మద్దతు కోరేందుకు ఒకోసారి ఇలాంటివి వస్తుంటాయి.అలాంటప్పుడు""మింగమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు కోపము అన్న చందంగా వచ్చిన సందర్భంలో మాట్లాడితే ఒకరికి కోపం,మాట్లాడకుండా ఉంటే మరొకరికి కోపం.ఇదంతా ఎందుకు అనుకుంటూ మౌనంగా ఉండటం. ఈ మౌనంగా ఉండటం అనేది వాళ్ళు చేసిన పనిని కొంత వరకు ఒప్పుకోవడం అన్న మాట.ఇలా చాలా మంది వ్యక్తులు తమ మనసులోని మాటలను పూర్తిగా చెప్పడానికి ఇష్టపడరు.
అంగీకారంగా భావించబడే సందర్భాలు రెండు రకాలుగా ఉంటాయి. ఎదుటి వ్యక్తులు ఏదైనా ప్రతిపాదన చేసినప్పుడు మాట్లాడవలసిన సందర్భం అయినప్పటికీ మౌనంగా ఉండటం. మరో ఏదైనా నిర్ణయానికి సంబంధించి నోరెత్తకపోతే , మౌనంగా ఉంటే అది అర్థ లేదా మొత్తం అంగీకారంగా భావించబడుతుంది.
ఇలాంటి మౌనం గురించి ప్రముఖులు ఏమన్నారో చూద్దాం.
' మౌనమె నీ భాష ఓ మూగ మనసా! అని మనసుకవి ఆత్రేయ గారు అన్నట్లు, మరో సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది.. ఎదిగే కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది... ఇలా కవులు రచయితలు, ప్రముఖులు తమదైన శైలిలో ఈ మౌనాన్ని నిర్వచించారు.
మౌనం గురించి సంస్కృతంలో ఓ శ్లోకం వుంది.అదేంటో చూద్దాం.
"కృషితో నాస్తి దుర్భిక్షం;జపతో నాస్తి పాతకమ్, మౌనేన కలహో నాస్తి. నాస్తి జాగరతో భయమ్ " ఈ శ్లోకాన్ని బట్టి వాక్కును నియంత్రించడం, మాట్లాడకుండా నియత్రించడం, తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది. ఇదో గొప్ప కళ.
మౌనంగా ఉండి వారిని మునులు అంటారు.మాట్లాడే మాటలు వినేవారికి ఇంపుగా, హితంగా ఉండటమే కాకుండా మితంగా ఉండాలనీ,అది చేతకానప్పుడు మౌనంగా ఉండటమే మేలని "విదురనీతి" చెబుతోంది.
పంచ శాంతులలో ఉపవాసం,జపం, మౌనం, పశ్చాత్తాపం, శాంతి ముఖ్యమైనవి.అందులో "మాట వెండి అయితే మౌనం బంగారం లాంటిది"అనే సామెత కూడా ఉంది.
మౌనంలో వాజ్మౌనం అనగా వాక్కును నిరోధించడం. దీనినే మౌనవ్రతం అంటారు. రెండవది అక్షమౌనం అనగా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం.
మూడోది కాష్ఠ మౌనం అనగా మానసిక మౌనం. మౌనంగా ఉంటూ మనసును నిర్మలంగా ఉంచుకోవడం.ఇలా మూడు మౌనాలు చాలా ముఖ్యం.
ఈ మౌనాల వల్ల మనలో ఒకానొక దివ్యశక్తి ఉదయిస్తుంది.మనోశక్తులూ వికసిస్తాయి. మౌనం వల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి, ఉత్పన్నమయ్యి ఆత్మ శాంతి లభిస్తుంది.
మౌనాన్ని అవలంబించడం సదుపయోగం అవుతుందని పతంజలి మహర్షి యోగాలో మౌనానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మౌనాన్ని అవలంబించిన వారిలో శ్రీయుతులు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మొదలైన మహనీయులు ఉన్నారు. ఈ మౌనం ద్వారానే వారు ఆయా సందర్భాలలో వారి బోధన జరిగేది.
ఏది ఏమైనా మౌనం చాలా గొప్పది "అనిషిద్ధ మనుమతమ్ " ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మౌనం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలిసింది. నిషేదింపబడని విషయాల్లో మౌనం ద్వారా అంగీకారమయ్యేలా చేయవచ్చనీ, మౌనం మనిషిలోని దివ్య శక్తులను బయటికి తీస్తుంది అని తెలుసుకున్నాను. దీనిని గుర్తు పెట్టుకొని ఎయే సందర్భాల్లో ఎలా ఉండాలో అలా పాటించడం నేర్చుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి