కొందరి మాటలు
చినుకులై రాలుతాయి
అమృతమై పారుతాయి
తేనెచుక్కలై చిందుతాయి
కొందరి మాటలు
పువ్వుల్లా పూస్తాయి
పొంకాలు చూపుతాయి
పరిమళాలు చల్లుతాయి
కొందరి మాటలు
ఇంపుగా ఉంటాయి
సొంపుగా వినిపిస్తాయి
కమ్మగా తోస్తాయి
కొందరి మాటలు
సామెతలవుతాయి
హితములవుతాయి
ఉదాహరణలవుతాయి
కొందరి మాటలు
ఆటపట్టిస్తాయి
పాటపాడిస్తాయి
నాట్యంచేయిస్తాయి
కొందరి మాటలు
తూటాలు ప్రేలుస్తాయి
మంటలు పుట్టిస్తాయి
ద్వేషాన్ని రగిలిస్తాయి
కొందరి మాటలు
వ్యర్ధమనిపిస్తాయి
అర్ధంలేదనిపిస్తాయి
స్వార్ధాన్నితెలుపుతాయి
కొందరి మాటలు
తక్కువగుంటాయి
ఎక్కువభావాన్నితెలుపుతాయి
నోర్లలోనానుతాయి
కొందరి మాటలు
తియ్యగుంటాయి
తెలివిగుంటాయి
తలల్లోనిలుస్తాయి
కొందరి మాటలు
గుర్తుపెట్టుకుంటాము
ప్రయోగిస్తుంటాము
ప్రచారంచేస్తుంటాము
కాటావేసి మాటలు
సమయానుకూలంగా వాడాలి
సంశయానికి తావులేకుండా చూడాలి
సూటిగా శ్లేషలేకుండా ప్రయోగించాలి
మాటలు మంచివైతే
నోరుకు విలువస్తుంది
ఊరు బాగుంటుంది
పేరు వస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి