పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తిరుమలేశం దీక్షగా చదువుతున్నాడు. ఇంతలో అతని ఇంటికి అతని క్లాస్ మేట్స్ పరమేశం, జగదీశం వచ్చారు. "ఒరేయ్ తిరుమలేశూ! పరీక్ష ఎలా రాసినావు?" అన్నాడు పరమేశు. "తెలుగు, హిందీ పరీక్షలు రెండూ బ్రహ్మాండంగా రాసినాను. మధ్య మధ్య సెలవులు వస్తున్నాయి. మిగతా పరీక్షలు చాలా బాగా రాయాలి." అన్నాడు తిరుమలేశం. టీవీల్లో క్రికెట్ పోటీలు వస్తున్నాయి. ఆ పోటీలు చూస్తూ మిగతా సమయం చదువుకుంటే ఎంతో బాగుంటుంది." అన్నాడు జగదీశం. "పరీక్షల సమయంలో విద్యార్థులను చదువుకోనివ్వకుండా డిస్టబ్ చేయడానికి పరీక్షల సమయంలో ఆడాలా ఈ ఆటలు?" అన్నాడు తిరుమలేశు. "20 ఓవర్లలో ఒక టీం 200కి పైగా రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీం అంత పెద్ద టార్గెట్ చేజ్ చేస్తే ఉంటుంది మజా. అలాంటి ఆటలు చూడటానికి ఉండాలి అదృష్టం." అన్నాడు జగదీశం. "అంత అదృష్టం మన తిరుమలేశానికి ఉండదు పాపం." అన్నాడు పరమేశం.
అప్పుడు తిరుమలేశం ఇలా అన్నాడు. "మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ మనసులో మనం ఎంత మార్కులు సాధించాలో లక్ష్యం నిర్దేశించుకుంటారు. ఉదాహరణకు 550కి పైగా మార్కులు సాధించాలని అనుకుంటారు. మనం సాధించలేక పోతే బాగా నిరుత్సాహ పడతారు. మంచి మార్కులు సాధిస్తే కాలేజ్ ఫీజులో మినహాయింపు ఉంటుంది. మన స్వార్థం, సంతోషం కోసం తల్లిదండ్రులను నిరుత్సాహ పరచడం సరికాదు." అన్నాడు తిరుమలేశం. "బాగా చెప్పావు అన్నయ్యా!" అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన స్రవంతి. "మరి పరీక్షలు మొత్తం అయిపోయాక అయినా ముగ్గురం కలిసి క్రికెట్ చూద్దాం." అన్నాడు జగదీశు. "కుదరదు నా చెల్లెలు 8వ తరగతి. తన వార్షిక పరీక్షలు ఉంటాయి. చెల్లెలి అనుమానాలు నివృత్తి చేస్తూ చెల్లెలిని చదివించాలి. చెల్లెలి పరీక్షల అనంతరం ఈ వేసవి సెలవుల్లో చుట్టాల ఇంటికి వెళ్ళి, లేదా చుట్టాలను ఆహ్వానించి కరవు తీరా ఆడుకోవాలి. టీవీలు, మొబైల్ ఫోన్లు పూర్తిగా పక్కన పెట్టి." అన్నాడు తిరుమలేశు. "బాగా చెప్పావు అన్నయ్య." అన్నది స్రవంతి.
మంచి ఆలోచన : - సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి