సుప్రభాత కవిత : - బృంద
తలిరాకు ముంగిట నిలిచిన 
చిరు నీటి బొట్టు అద్దాన
అల నీలి గగనాన వెలిగే రవి
తొలి కిరణ కాంతి..

అంబరపు నీలిమంతా 
అవనికి దిగివచ్చి 
అంతలో బిందువుకు 
బందీగ చిక్కె కాబోలు!

హరివిల్లు లోని సప్త వర్ణాలు 
మురిపముగా ఇమిడే 
మేలిమి ముత్యము బోలిన
తుహిన బిందువులోన!

చిన్న అణువుకైనా మిన్నగా దొరకు 
ఆపన్న హస్తము నందించు
ఏలికైన లోకరక్షకుని కరుణ 
ఎన్నగాను జగతికి రక్ష కాదా?

విశ్వమును తన సన్నల నడిపే 
విశ్వరూపుడు పొందికగా ఇమిడె 
చిన్ని నీటి చుక్కలోన
చిత్రముగా తోచు కదా వీక్షింప వింత!

చుక్కకు చుట్టము కాదు 
ఆకుకు ఆత్మీయుడు కాదు
అంతయు తానే అయినా
తనది ఏమీ లేదను సూచన కాబోలు!

ముత్యమంటి  మేలిమి 
మమతలు కలిగిన మదికి 
పంచగా ఎంచి చూచిన
ఏది సొంతము?ఏది కాదు?

అందరికాధారమైన ఆదిత్యుని కి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు