పగ పట్టినవిధి నను విడువదులే:- త్రివిక్రమశర్మ అధ్యాపకులు సిద్దిపేట
కోరిక తీరక దుఃఖము కలిగే 
దుఃఖము తీరక బాధలు కలిగే
బాధలు తొలగక గుండె బరువాయే
గుండె బరువుతో మనసే చెదిరే.

మనసు చెదిరితే బ్రతుకు బరువాయె 
బ్రతుకు బరువుతో  కన్నీరు రాలే
రాలిన కన్నీరు నదిలా మారే
కన్నీటి నది కడిలిగా మారే

కన్నీటి కడలిలో కష్టాల సునామీ
కష్టాల సునామీలో కడగండ్ల వాన 
కడగండ్ల కడలి కల్లోలమాయే 
కల్లోల కడలి నింగిని చేరే 

నింగిని చేరిన కన్నీరే
కుంభ వృష్టిగా పుడమిని చేరే
పుడమికి చేరిన నా  బాధలనే 
భరించలేని భూదేవి

 భూకంపాల విస్ఫోటనమై 
తిరిగి నా పైకి వెదజల్లే
కృంగి కృశించి నలిగిన నాపై 
కష్టాల ధూళి ముంచెత్తే

ప్రకృతి సైతం మోయ లేదులే
పంచ భూతాలు తీర్చలేవులే
పంచ ప్రాణాలు పోయేదాకా
పంచేంద్రియాలు సడలే దాకా

పగ పట్టిన విధి నను వీడదులే
విధి వంచితుని చేసి విర్రవీగులె
కాలినబూడిదకేమి విలువనే
పరమ సత్యమిదే  తెలియవే మనసా

కామెంట్‌లు