సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-824
"ఉత్ఫతితోపి హి చణకః శక్తిః కిం భ్రాష్ట్రకం భంక్తుమ్" న్యాయము
****
ఉత్పత్తితోపి అనగా ఎగిసిపడిన, ఎగురుతున్న.హి  అనగా కూడా.చణక అనగా సెనగ గింజ. కిం అనగా ఏమిటీ ,ఎవరైనా కూడా శక్తి అనగా బలం. భాష్ట్రకం అనగా మూకుడును .భంక్తుమ్ అనగా పనిలేని అర్థ రహితమైన. భ్రాష్ట్రకం భంక్తుమ్ అనగా మూకుడును పగులగొట్ట గలదా అని అర్థము.

కాలిన మూకుడులో ఎగురుతూ ఉన్న సెనగ గింజ మూకుటిని పగల గొట్టగలదా? "అల్పుడు మిడిసిపడినా, మంచి వారినేమీ చేయలేడు" అని అర్థము.
 "మంచి వాళ్ళను ఎవరేం చేయలేరు" అనే సామెతకు అర్థం ఏమిటంటే  వాళ్ళు ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వారి మంచిని వీడరు అని అర్థము.
కాలిన మూకుడులో లేదా మంగలంలో ఏవైనా గింజలు శనగలు, మొక్క జొన్న గింజలను వేయించినప్పుడు అవి చిటపట అంటూ ఎగురుతూ వుంటాయి.అవి ఎంత బలంగా ఎగిరినా మూకుడుకు ఎలాంటి ప్రమాదమూ లేదు.‌అనగా ఇక్కడ మూకుడును మంచివాడితోనూ, ఎగిరిపడే గింజలను చెడ్డవారితోనూ పోల్చడం జరిగింది.
ఎందుకంటే మంచి మనిషి అనేవాడు మూకుడులా నిగ్రహం కలిగి ఉంటాడు. చెడ్డ వాడు చిన్న ప్రతి దానికీ ఎగిరెగిరి పడుతూ మంచి వాళ్ళను యిబ్బంది పెడతాడు.
దీనినే కాకుత్సం శేషప్పకవి తన నృకేసరి శతకంలో ఇలా అంటాడు.
"ఏనుగు బోవ జూచి ధ్వనులెత్తుచు గుక్కలు గూయసాగుచో/ దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే/ మానవులందు సజ్జనుడు,మత్తులు కొందరు గేలి సేయుచో/ ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ నృకేసరీ "
అనగా  ఏనుగు పోతూ వుండగా చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు.అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసినా, అతడు కోపించి వారితో వాదులాడబోడు.ఇది సజ్జనుడి స్వభావం.
 నీళ్ళలో పడిపోయి కొట్టుకు పోతున్న తేలును రక్షిద్దామని ప్రయత్నించినా దాని దాని కుట్టే బుద్ధి మానదు.అయినా సాధువు బాధను భరిస్తూనే దానిని గట్టెక్కిస్తాడు.
 మంచివారి స్వభావం ఎల్లప్పుడూ పరోపరిగా వుంటుంది.
అందుకే వేమన ఇలా అంటాడు " గుణములు గలవాని కులమెంచగానేల/ గుణము కలిగెనేని కోటి సేయు/ గుణము లేక యున్న గ్రుడ్డి గవ్వయు లేదు/ .. ..
అనగా మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచిగుణము కలిగిన వాని కులమును ఎవరూ అడుగజాలరు.ఎంత మంచి కులములో పుట్ఠినా గుణము లేకపోతే గుడ్డి గవ్వంత విలువ కూడా చేయరు" అంటాడు.
కాబట్టి ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే  మంచితనం, మానవత్వం ఈ నేలపై ఎప్పుడూ కొందరి రూపంలో ఉంటూనే ఉంటుంది.వారిపై ఎలాంటి భౌతిక,మానసిక దాడులు చేయాలనుకున్నా వారిలోని మంచి మానవతను ఏమీ చేయలేరు.మనం చేసేది మంచిదైతే  ఎవరికీ భయపడాల్సిన,తల వహించాల్సిన పని లేదు... మన పని చేసుకుంటూ  పోదాం మంచి వాళ్ళను గౌరవిద్దాం .

కామెంట్‌లు