రాలిన కలలు మరచిపోయేలా
వాలిన కనుల మెరుపు నిండేలా
సోలిన చూపులు విచ్చుకునేలా
మేలైన వాస్తవాలు ఎదురయే ఉదయం!
ఎత్తులు ఎక్కించే వింతలు
కిందికి పడదోసె మోసాలు చూసి
నిలదొక్కు కుని నిలబడ్డ
నిజాయితీని గుర్తించే ఉదయం!
పాఠాలు నేర్పిన పరిస్థితులు
గుణపాఠం చెప్పిన నమ్మకాలూ
గురుతెరిగి వేసిన అడుగుల
పయనపు పరమార్థం తెలిపే ఉదయం!
నీడలేని దశనుండి పదుగురికి
నీడనిచ్చే స్థాయికి ఎదిగే
ధృడమైన సంకల్పము కలిగిన
హృదయాలకు తోడొచ్చే ఉదయం!
ఒంటరిగా మొదలుపెట్టినా
వెంట అందరూ వచ్చేలా
మింట వెలిగే తారలా మెరిసే
నిండుమనసుల కల పండించే
ఉదయం!
కొండల కావల ప్రభవించి
గుండెల కాంతులు నింపాలని
నిండుగ ప్రభలను ప్రసరిస్తూ
పండుగలా వచ్చే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి