రాజ్యాంగాన్ని రక్షించుకుందాం...రండి..?:- కవిరత్న,సహస్రకవిభూషణ పోలయ్యకూకట్లపల్లి, -అత్తాపూర్, హైదరాబాద్
(అంబేద్కర్ ఆత్మ ఘోష)...
 
( డా.బి ఆర్ అంబేద్కర్ 134 వ
జయంతి సందర్భంగా ప్రత్యేక కవిత...)

ఓ మేధావులారా..!
ఓ బహుజన బాంధవులారా..! 
ఓ అంబేద్కర్ వారసులారా...!
తన రక్తాన్ని సిరగా మలచి...
తన శ్వాసల్ని సూత్రాలుగా నేసి...
రాత్రింబవళ్ళు శ్రమించి స్వేదం చిందించి...
"భారత రత్నగా"...
"సంఘ సంస్కర్తగా"...
"నవ సమాజ నిర్మాతగా" 
"భారత రాజ్యాంగ శిల్పిగా"...
"భరత మాత ముద్దు బిడ్డగా"...
"అణగారిన వర్గాల ఆశాకిరణంగా"...
అవతరించిన...అమరజీవి... 
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్...! 
ఒక మహనీయుడు..!ఒక మహర్ వీరుడు!

ఆయన మనకిచ్చిన 
భారత రాజ్యాంగం
ఒక మతగ్రంథం కాదు...
అది ఒక మంత్రదండం...
అందులోని ఒక్కొక్కఅక్షరంలో...
దాగి ఉంటుంది ఒక రక్తచరిత్ర..!
పొందు పరిచిన ఒక్కొక్కహక్కు...
దొరలదోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యం..!

కానీ నేడు...
నీవు గాఢనిద్రలోనూ 
నిష్క్రియలోనూ ఉండగా 
ఆ పుస్తకంలోని పుటలను 
చీకటిలో చించేస్తూన్నారు...
నీ భవిష్యత్తును అంతులేని 
అంధకారంలో ముంచేస్తున్నారు..!

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి...
ఇది నీ బ్రతుకు పోరాటం..!
ఇది నీ బిడ్డల ఆశల ఆశయాల
అంతులేని అభద్రతల ఆరాటం..!

రేపు నీ పిల్లలు రెక్కలున్నా
ఎగరలేని పక్షులౌతారు...
రెక్కలు తెగిన పావురాలౌతారు...
చరిత్రలో పేరులేని పేజీలౌతారు...!

అందుకే ఓ అమాయకులారా..!
"చలివేంద్రం" పగిలిన తర్వాత
నీరెక్కడిది మీరు పంచుకోవడానికి..?
నీరెక్కడిది మీ దాహం తీర్చుకోవడానికి..? 
కలహించుకుంటూ...
కత్తులు నూరుకుంటూ...
కుత్తుకలు తెంచుకుంటూ...
మనువాద మత్తులో మునిగిన
మీ ప్రయాణం సాగేది ఎక్కడికి..? 
నిశ్శబ్దంగా శాశ్వతంగా శ్మశానానికే కదా..!

ఆలోచించండి..! రాజకీయ ఒత్తిళ్ళను...
పక్కన పెట్టండి...తీర్పుల చీకట్లలో...
వినాశనకర బీజాలు నాటుతున్నారు...
రాజ్యాంగం...మనువాదుల చేతిలో మృత్యుశాసనంగా...మారబోతుంది... 

ప్రభుత్వాలు మారినప్పుడు... 
పౌరహక్కులు కార్పొరేట్ 
పందికొక్కుల జేబుల్లోకి చేరినప్పుడు... 
తినేతిండి పంచుకునే కరువురోజులొస్తే
నేటి నీ మౌనం రేపు నీకు శాపమౌతుంది..!

నీవు మూర్ఖుడివి కాదు మునివి కాదు...
కానీ నీ మౌనం నీ అజ్ఞానం నీ శత్రువు
చేతికి ఒక వజ్రాయుధమౌతుంది...!

ఓ మేధావులారా..!
ఓ బహుజన బాంధవులారా..! 
ఓ అంబేద్కర్ వారసులారా...!
ఇకనైనా జాగ్రత్త పడండి...!
చుట్టూ కళ్ళు తెరిచి చూడండి...
అంబేద్కర్ చూపిన దారిలో కుట్రలు 
కుతంత్రాలు పన్నేవారిని గుర్తించండి...
నవ్వించే నయవంచకుల్ని నమ్మకండి...

ఈ "విషసర్పాల వింతఆట" కట్టించాలి...
ఇది చీకటి పేటికలో మన బంగారు 
భవిష్యత్తు దాచే భయంకరమైన కుట్ర..!

ఇది శోకగీతం కాదు 
ఇది "సజీవ సమర గీతం"..!
అంబేద్కర్ ఆశయాలు పండేలా...
ఆయన ఆత్మ క్షోభించని రీతిలో...
రక్తతర్పణ చేసైనా సరే 
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి..!
రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి...!




కామెంట్‌లు