సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-847
"క్షణభంగి జగత్సర్వ మితి తథ్యం మునేర్వచః" న్యాయము
****
క్షణభంగి అనగా క్షణ కాలము మాత్రమే వుండునది, తాత్కాలిక మైనది,నశించేది,దుర్భలమైనది. జగత్సర్వం అనగా ప్రపంచమంతా, లోకమంతా.మితి అనగా పరిమితి, హద్దు,గడువు,కొలత. తథ్యము అనగా నిజము .మితి తథ్యం అనగా నిర్థిష్టమైన  సంఘటన లేదా వ్యవహారానికి సంబంధించిన సమయం మరియు తేదీ నిజము. ముని అనగా నిశ్శబ్ద, సన్యాసి,ఋషి. వచః అనగా మాట,భాష, వాక్కు. మునేర్వచః అనగా మునుల మాట, మునుల వాక్కు అనే అర్థాలు ఉన్నాయి.
జగత్తంతా క్షణ భంగురమని మునులు చెప్పిన మాట సత్యము అని అర్థము.
ఈ జగత్తు లేదా లోకం క్షణ భంగురం  అని మునులు అంటుంటారు.అనగా ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఈ లోకం నశించి పోతుంది అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే లోకం నశించడం అంటే లోకం మారిపోవడం, మార్పులకు లోనవడం అని అర్థము. అనగా ఇప్పుడు ఉన్నది మరుక్షణం ఉండదు.మార్పుకు లోనవుతుంది.
 భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రపంచం గురించి చెప్పిన శ్లోకాన్ని చూద్దాం.
"నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః!/ ఉభయోరపి దృష్టోద్యంత స్త్వనయోస్త త్త్వ దర్ శిభి!/
అనగా అశాశ్వతమైన వాటికి ఓర్పు ఉండదు.శాశ్వతమైన వాటికి విరమణ ఉండదు. ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు ప్రపంచం ఉనికిలో ఉందని, కానీ అది క్షణికమైనదని, తాత్కాలికం అని పిలుస్తాడు.
అయితే లోకం క్షణ భంగురం అనే మాట మునులు చెబితే సామాన్య జనుల నోట "జీవితం క్షణ భంగురం" అనే మాట తరచూ వింటుంటాం. అనగా ఎప్పుడు ఏం జరుగుతుందో జీవితం ఎలా మారిపోతుందో తెలియదు. ప్రతి క్షణం సరిహద్దు సైనికుడిలా అప్రమత్తంగా లేనట్లయితే ఎప్పుడు ఏ ప్రమాదము ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి  ఏమాత్రం ఏమరుపాటు కూడదు అంటారు.
అలా జీవితం అశాశ్వతం.ఏ క్షణమైనా ముగిసిపోతుంది.అలాగేఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అశాశ్వతం.ఏదీ మన వెంట రాదు.ఈ జీవితం మూడు నాళ్ళ ముచ్చటే అని,నీటి బుడగ వలె అశాశ్వితమని, క్షణ భంగురమని మానవుడు గుర్తు పెట్టుకోవాలి.
"క్షణభంగి జగత్సర్వ మితి తథ్యం మునేర్వచః" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మునులు చెప్పినట్లు ఈ లోకమే కాదు మనిషి జీవితం కూడా క్షణ భంగురమని గ్రహించి బతికినంత కాలం మంచి పనులు చేస్తూ,మన ఆశయాలను సాధించుకోవాలి.‌అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది.

కామెంట్‌లు