నిలువెత్తు మనీషి:- డా.టి.రాధాకృష్ణమాచార్యుల-9849305871
అతడు 
నిలువెత్తు మనిషి
యుద్ధనీతి ఎరిగిన గొప్ప మౌనముని
ఆ ఊపిరి
ప్రగతిశీల శాంతి సౌరభాల వెలుగు దారిలో  
అవిశ్రాంత మేదోమధనం 

అతడు
ఇలలో తడియారని గొంతుక
సామాన్యులలో అసమాన్య అక్షరాయుధం మేలుకొలుపు
ఆయన
జీవితమే సంఘర్షణ మిరుగులు విసిరిన స్వేచ్ఛాపథం

ఆ చూపు 
ఆర్తుల హక్కుల సాధనలో  పౌర సామాజిక సమాచార అస్త్రాలతో సాగే అలుపెరుగని పోరు రహదారి
ఆ పాట
నేలపై కాళ్ళూని నీలి పొర కింద
నడయాడిన 
సర్వ స్వతంత్ర భావ సంగమ ప్రేరణ గీతం

ఆ మనస్ఫూర్తి నవ్వు 
విరిసిన తోట తిరిగిన సుమదళం
రోజూ కొత్తగా గొప్పగా
తెరిచిన విండో లోక్ సత్తా జండా
ఆ మాట
ఓ భరోసా ఒక నమ్మకం
అన్యాయం అక్రమాలనెదిరించిన ఉద్యమ కెరటం 
ఆ సౌమ్యం 
ఓ ఆత్మీయ సాదర మైత్రి యాత్రల 
చెరిగిపోని చరిత్ర

ఆ నడక
అమలిన స్నేహం
కొంత మెత్తగా, ఓర్పుగా నొప్పించక
పెళ్ళుబికిన సహృదయ సముద్రగర్భం 
ఆ ఆలోచన
తాడిత పీడితుల దృష్టికోణం
బెదింపులకు లొంగని ఉక్కు సంకల్పం 

ఎందరో మిత్రులకు అండైన కొండ
అందరికీ అరుదైన బంధువతడే
కలిసి తిరిగిన గొప్ప సంఘసంస్కర్త
మానేరు మట్టిలో నడిచిన అసమాన్యశక్తి

అతడే నరెడ్ల శ్రీనివాస్
ఓ మహోన్నత సామాజిక మానవీయ శిఖరం
కరీంనగర్ గడియారం గంటలైన మోగిన నిలువెత్తు మనీషి

========================================


( కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో నరెడ్ల శ్రీనివాస్ విగ్రహావిష్కరణ వేళ) ఓ స్నేహమయి నివాళి .
...
కామెంట్‌లు