తుదివిన్నపం:- సత్యవాణి
మరచేవా నన్ను దేవా
మరణం రాదానాకు
చేతులెత్తి నిను ప్రార్థిద్దామంటే
చేతులు పైకి లేవకున్నాయి
మనసారా నిను ప్రార్థిద్దామంటే
పెదవులు వణుకుతున్నాయి
మాటలుకొరబోతున్నాయి
మదిలోసదా నీ నామజపమే 
మరణం నాకసన్నమయ్యేంతవరకు
అంతులేని ఆయువిచ్చి నన్ను
అపహాస్యంపాలు చేస్తున్నావా
నా అని అనుకోనివారు  లేని
ఈ ప్రపంచం నాకు
పనేముంది 
చూడాలనిపిస్తుంది  ఈప్రపంచాన్ని
కనిపించదు
నలుగురూ మాట్లాడుకొంటున్న విషయం తెలుసుకోవలనివుంటుంది
వినిపించదు
నలుగురితో మాట్లాదాలనిపిస్తుంది
ఆ నలుగురూ నాతో ఆప్యాయతతో మాట్లాడాలనిపిస్తుంది
మాట్లాడేవారేవుండరు
పోనీఅని నేనే మాట్లాడినా
వినేవారేవుండరు
పలకరించినా
పన్నెత్తి పలికేవారుండరు
తినాలనిపిస్తుంది
పెట్టేవారుండరు
తిడుతూ పెట్టిన ఆకాస్తా
తినలేకపోతున్నాను
తిన్నా ఒంటపట్టటంలేదు
దేవా
అప్పుడు ఒకప్పుడు 
ఒకానొకప్పుడు
నిశ్చింతగా వున్నప్పుడు
నిను తలువనే లేదు
బాల్యంలో ఆటపాటలతో
వయసొచ్చేకా
పెళ్ళి పిల్లలు బాధ్యతలూ బంధనాలతో
నిను తలవనే లేదు
కొలవనేలేదు నిన్ను
బాధ్యతలు తీరాయి
ఓదేవా
నడకరాని బిడ్డలా
నవారు సాగిన మంచంలా
వున్నానిప్పుడు
మంచంలో నేను
కంచం నాదగ్గరకి
మెతుకుల మీద పేరున్నన్నాళ్ళూ
వుంటామని
ఎవరో  ఎప్పుడో అన్నమాట
గుర్తొచ్చినప్పుడల్లా
భయంకలుగుతోందినాకు
పేరులేని మెతుకులు
ఎప్పుడెప్పుడొస్తాయా అని
ఆతృతతో ఎదురుచూస్తున్నా
ఆ క్షణానిమ్మని నిను ప్రార్థిస్తున్నా
వార్థక్యం వరంకావాలి
శాపం కాకూడదు
భీష్మునికిలా
ఇచ్ఛామరణం 
కావాలి ప్రతిజీవికి 
కచ్చ తీర్చుకోకూడదు నీవు నీవు సృజించిన జీవులపట్ల
కసుగాయలపట్ల
కారుణ్యంచూపు
ఇలపైనొదిలేయ్ వారిని
కావాలనుకొనేవారినుండి
వారిని దూరంచేయకు
విముక్తి కోరుకొనే
నాలాంటి దీనులమొర ఆలించు
మాలాంటి బాధాతప్త హృదయుల ఆయుష్యు
ఆకసుగాయలకు పోసి వారిని రక్షించు
ఇదే నా తుదివిన్నపం
కావాలి
అది నీచెవినిసోకాలి
         
        

కామెంట్‌లు