ఓర్పు:-సి.హెచ్.ప్రతాప్

 ఒక గ్రామంలో ఒక గొప్ప కీర్తిశాలి అయిన ధనికుడు నివసించేవాడు. అతడు సకలైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఒక పెద్ద భవంతిలో ఆనందంగా జీవించేవాడు. ఆ భవంతి  సమీపంలోనే ఒక పేద మనిషి వాడిపోయిన చిన్న కుటీరం లో ఉండేవాడు. అతడు ఇతరులు తిని పారేసిన ఆహారంతో  జీవించేవాడు. అయినా ఎప్పుడూ ముఖంలో నవ్వే ఉండేది. తన దురదృష్టం గురించి ఒక్కసారి కూడా అతడు ఎవ్వరికీ ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేయలేదు.
ఒకరోజు అతడికి చాలా కాలంగా ఏమీ తినడానికి దొరకలేదు. ఆకలితో బాధపడుతూ ఆ ధనవంతుడి వద్దకు సహాయం కోసం వెళ్లాడు. వృద్ధ ధనవంతుడు అతన్ని స్నేహంగా స్వాగతించి, ఎందుకు వచ్చావని అడిగాడు.
"ప్రభూ, నాకు కొన్ని రోజులు గా తినడానికి ఏమీలేదు. కాస్త ఆహారం ఇచ్చితే చాలనిపిస్తుంది," అని పేదవాడు చెప్పాడు.
"అంతేనా!" అన్న వృద్ధుడు, "ఇక్కడ కూర్చో!" అని ఆజ్ఞాపించాడు. వెంటనే తన వంటవాడిని పిలిచి " ఈ రోజు ఒక అతిధి భోజనానికి మనింటికి వచ్చాడు. మంచి రుచికరమైన  భోజనం సిద్ధం చేయు.మన చేతులు కడగడానికి నీళ్లూ తీసుకో రా."
పేదవాడు ఆశ్చర్యపోయాడు. ఈ ధనవంతుడు ఎంతో దయావంతుడు అని వినాడు గానీ ఇంత వేగంగా ఆహ్వానం ఇస్తాడని అనుకోలేదు. అతడు అదే విషయాన్ని ధనవంతుడితో చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు నవ్వుతూ అన్నాడు, "అదేం ప్రవలేదు మిత్రమా! ఇప్పుడు భోజనం ప్రారంభిద్దాం."
ధనవంతుడు  చేతులు కడుక్కుంటున్నట్లు నటించాడు. పేదవాడు అక్కడ నీరు కాని సేవకులు కాని కనిపించకపోయినా, ఆపకుండా ఆడుతున్న నాటకాన్ని అర్థం చేసుకుని, తానేనూ చేతులు కడుక్కుంటున్నట్లు నటించాడు.
"ఇప్పుడీ విందు ప్రారంభిద్దాం!" అన్న ధనవంతుడు ఆపై ఎన్నో రుచికరమైన వంటకాల పేర్లు పాడుతూ ఆహారం తెచ్చినట్లుగా నటించాడు. కానీ నిజంగా ఎక్కడా ఆహారమూ లేదు.
"ఇవే అన్ని అద్భుతమైన వంటకాలు మిత్రమా!" అని ధనవంతుడు  అన్నాడు. "ఇవి అన్నీ మరిచిపోలేనివి. నీవు తినాలి తప్పకుండా!" అతడు ఖాళీ పళ్ళాళ  నుండి తింటున్నట్లు నటించాడు.
పేదవాడికి బాగా ఆకలేసింది. కానీ తన బుద్ధిని కోల్పోలేదు. నిరాశలో మునిగిపోలేదు. అతడూ ధనవంతుడి  మాటలు పాటిస్తూ నాటకంలో భాగం అయ్యాడు. ఖాళీ పళ్ళాళ నుంచి తింటున్నట్లు నటించాడు.
"ఇంత బాగున్న ఆహార పధార్ధాలను ఎప్పుడైనా తిన్నావా?" అని ధనవంతుడు అడగగా "అవునండి, అద్భుతంగా ఉంది!" అని పేదవాడు బదులిచ్చాడు.
"మరి ఇంకొంచెం తీసుకోండి!" అంటూ మరో ఊహాత్మక వంటకాన్ని ధనవంతుడు పెడుతూ సాగించాడు.
ఇలా ఎంతో కాలం ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నా, పేదవాడు ముఖంలో చిరునవ్వు వీడకుండా ధనవంతుడు పొగిడాడు. విందు అద్భుతమని నటించాడు.
వాస్తవానికి ఆ ధనవంతుడు  సహృదయుడు. దానగుణం కలిగినవాడు. అతడు ఈ పేదవాడు నిజంగా ఎంత స్థిరబుద్ధితో, సంతోషంగా ఉంటాడో పరీక్షించాలనుకున్నాడు. అతనిపై వచ్చిన మంచి పేరు నిజమేనా అనేది తెలుసుకోవాలనుకున్నాడు.
తన అనుమానం తొలగిపోవడంతో, ధనవంతుడు  చప్పట్లు కొట్టాడు. సహాయకులు వెంటనే లోపలికి వచ్చారు. నిజంగా అన్ని రకాల రుచికరమైన వంటకాలతో కూడిన అద్భుతమైన భోజనాన్ని పీల్చి పెట్టారు. ఈసారి పేదవాడికి నటించాల్సిన పనిలేదు. అతడు నిజంగా తినగలిగాడు. బాగా తిని తృప్తి చెందాడు.
ఆ భోజనం అనంతరం ధనవంతుడు "మిత్రమా, నీవు అపారమైన ఓర్పు గలవాడివి. ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉండగలవు. ఇలాంటి మేధావి నా వ్యవసాయ భూములను పర్యవేక్షించేందుకు కావాలి. ఇక నువ్వు నా వద్దనే ఉండాలి."అని అన్నాడు
అప్పటి నుండి ఆ పేదవాడికి ఇక ఏదీ అవసరపడలేదు. ముందు ముందు  బాధలు, ఆకలిలేని జీవితం అతనికి అతని ఓర్పు వలనే బహుమతిగా లభించింది.


కామెంట్‌లు