"అమ్మా! నేను మనింటికి వెంటనే రావాలనుకుకొంటున్నాను. నన్ను పంపించమని మీ అల్లుడిగారికి ఫోన్ చెయ్యి.!" ఫోన్ డాబామీదకు తీసికెళ్ళి తల్లికి ఫోన్ చేసింది సంద్య.
"అదేమిటే!మీ మావగారూ ,అత్తగారూ వచ్చారన్నావుగదా! వాళ్ళిలా రాగానే ,నువ్వు ఇక్కడికిరావడం ఏంబాగుంటుంది?అల్లుడుగారేమనుకొంటారు? "అడిగిందికూతుర్ని వాణి.
"నీకేంటమ్మా!నువ్వెన్నైనా చెపుతావు!అందరికీ తలోరకంగానూ చేయలేక చచ్చేదినేను. మావయ్యగారికి ఉప్పూ కారంలేకుండాచేయాలి.అత్తయ్యగారేమో "అమ్మాయ్ !నేనుగుంటూరు జిల్లాదాన్ని,నాకు కారాలూ ఉప్పులూ లేకపోతే నాకు ముద్దదిగదు."అంటారు.మాఆయన సంగతి సరేసరి,అన్నీ ఫ్రైలు.ఇంతమందికి ఇన్నన్ని రకాల వంటలు చెయ్యడం నావల్లకాదు. అదేమో నాకు తెలియదు. నువ్వాయనను అడగకపోయినాసరే, నేను రేపు బయలుదేరి వచ్చేస్తాను.ఆపై ఏమైనాసరే! "ఖరారుగా చెప్పేసింది సంద్య.
"చూడు సంద్యా!
చదువులనీ,ఆపైన ఉద్యోగాలనీ పాతికేళ్ళు పైబడితేకానీ మీ తరంపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటంలేదు. అదీ ఒంటికాయ సొంటికొమ్ములా ఒక్కడే పిల్లాడున్న వాడిని చేసుకొంటున్నారు.మరిమీ అత్తమామలకి మీ ఆయనొక్కడే అయినప్పుడు మీదగ్గరకు రాక మరెక్కడికి వెళ్ళగలరు. మీరు కాపురానికి వచ్చేసరికే ఒకవేళ అతగాడికి అక్కచెల్లెళ్ళున్నా ,మగపిల్లాడికన్నా ముందుగా ఆడపిల్లకు పెళ్ళిచేస్తారు కనుక, వాళ్ళ పురుళ్ళూ పుణ్యాల బాధ్యతలేసవీ మీకుండటంలేదు.ఏదోచుట్టం చూపుగా ఏ పండగకో పబ్బానికో ఏడాదికో ఆర్నెల్లకో ఆడబడచు ఇంటికివచ్చినా,ముఖంచిట్లించుకొంటూ, అంటీముట్టనట్లుండి, ముక్కుకంటించుకొన్నట్లు మూడుమాటలు పెదవి చివరనుండి మాట్లాడి , అయిష్టంగానే,తన ఇల్లుదోచుకోవడానికి వచ్చిన దొంగని చూస్తున్నట్లు చూస్తూ,ఆమెవెళ్ళేవరకూ వరకూ ఎలాగో మేనేజ్ చేస్తున్నారు.చూడవలసిన బాధ్యతున్న అత్తమామలనే చూడడానికి ఇష్టపడనప్పుడు,ఆడబడచులను ఎలా ఇష్టపడతారు మీరు?
మాటైములో పదహారేళ్ళు వచ్చేసరికే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయేవి.అప్పుడు ఉమ్మడికుటుంబాలుండేవి.ఒకే ఇంట్లో భర్త అతడి తోడబుట్టినవారూ, పెదతండ్రి పినతండ్రులు,వారి అక్కచెల్లెళ్ళూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తూపోతూవుండేవారు .కొందరిళ్ళలో వంటలు వేరైనా,ఉండేదిమాత్రం ఒకేఇంటిలో.ఉండేది ఇరుకిరుకు గదులలోఅయినా, మనసుగదులుమాత్రం విశాలంగావుండేవి వారివి. ఆడబచులకు,పెళ్ళిళ్ళూ,పురుడుపుణ్యాలు,వారికిపెట్టుపోతలూ,మరదులకు వడుగులూ,పెళ్ళిళ్ళూ,
తోడికోడళ్ళతో ,వారిపిల్లలూ,వీరిపిల్లలూ కలగలసి,ఎరమరికలు లేకుండాపెరగడంజరిగేది.
చిన్నచిన్న తగాదాలు,మాటతేడాలు వచ్చినా, పిల్లలూ పిల్లలూ దెబ్బలాడుకొన్నా, అప్పటికప్పుడు పెద్దవాళ్ళు ఏదేదో అనుకొన్నా,ఆటలో అరటిపండులా, అంతట్లోనే కలసిపోయేవారు.ఒకరికష్టసుఖాలలో మరొకరు అండగావుండేవారు. పెద్దవయసువారు లేదా,ఎవరైనారోగంపాలైనవారున్నా వారికి వ ఆ ఇంట్లోవారు భరోసాగావుండేవారు.ఒంటరితనం బాధ ఆ ఇంట్లో వారికి తెలియనే తెలియదు.ఇంచుమించుగా అలాంటింట్లోనే నా పెంపకంలో పెరిగినదానివినువ్వు.
ఆరోజులు మీ హయాంలో కనుమరుగైపోయాయి. మీకాలంవారు మీ భార్యాభర్తలూ,మీపిల్లలూతప్ప మీ ఇళ్ళలో మరోమనిషి ఉనికినే సహించలేకపోతున్నారు.గుడుగుడు గుంచం లా,ఎంతసేపూ మీరూ,మీపిల్లలూ మీకుమీరే కానీమరొకరంటే కిట్టదుమీకు.
సంధ్యా!పెళ్ళంటే భార్యాభర్తలేకాదు.ఇరువైపుల తల్లితండ్రులూ వారి కడుపున పుట్టినవారూ,బంధువులనూ కలుపుకొని,వీలైతే వారి కష్టసుఖాలలో తోడుగానిలవడం.
అలా ఇష్టంలేనివారు అనాధశరణాలయాలలో పెరిగిన వారిని పెళ్ళిచేసుకోవడం మంచిది.మీఇళ్ళకొచ్చేవారుగానీ,మీనుండి ఏదీ ఆశించే వారుగానీ ఎవరూవుండరు.
ఇంత పెద్దకుటుంబంలోంచి వెళ్ళిన నువ్వు అత్తమామల రాకనే భరించలేకపోతున్నావంటే,నా పెంపకాన్ని నేనే ప్రశ్నించుకోవలసివస్తోంది.నువ్విలా ప్రవర్తిస్తున్నావంటే మీ నాన్నగారు చాలా బాధపడతారు.కోప్పడతారుకూడా!బాగా ఆలోచించుకొని బయదేరు.నీ పుట్టింటికి ఎప్పుడైనా వచ్చే హక్కు నీకు వుంటుందికానీ,అదినీ ఇంట్లో నువ్వు నీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే నీకు ఇక్కడ గౌరవం లభిస్తుందన్న విషయంమాత్రం గ్రహించు.మరికనేనువుంటాను.
ఇట్లు మీ అమ్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి