విద్య – ఒక్క పదమే కాదు, సమాజాన్ని సంస్కరించే శక్తి. ప్రతి వ్యక్తి జీవితాన్ని మారుస్తున్న అద్భుత మార్గం. మంచి పౌరుడిగా ఎదగాలన్నా, సమాజానికి ఉపయోగపడే స్థాయికి చేరాలన్నా, విద్య అనేది నిత్యావసరమైన సాధనం. ఈ ప్రక్రియలో ప్రభుత్వ విద్య వ్యవస్థకు కీలక పాత్ర ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా అందించబడే విద్య వ్యవస్థ — దేశ అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తోంది. అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రభుత్వ విద్య వ్యవస్థ ప్రధానంగా ప్రతి ఒక్కరికి విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది వరంగా మారింది. ఉపాధ్యాయ వనరులు, సబ్సిడీలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాలు వంటి వనరుల ద్వారా విద్యను చేరువ చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, దేశ భవిష్యత్‌ను నిర్మించే శ్రమలో ఉంది. పాఠశాల ఫీజులు మినహాయింపు, మధ్యాహ్న భోజన పథకాలు వంటి పథకాలు ప్రభుత్వ విద్యను ఆర్థికంగా అందుబాటులో ఉంచుతున్నాయి. ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటం వల్ల పేద విద్యార్థులు మాత్రమే కాదు, మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే ఆసక్తిని కలిగి ఉంటాయి. ఉపాధ్యాయుల ఎంపికలో గల పారదర్శకత, శిక్షణ, ఉద్యోగ భద్రత వల్ల వారు నిర్భయంగా, దీర్ఘకాలికంగా విద్యా రంగానికి సేవలందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరును పెంచడమే కాక, వారి పోషణ అవసరాలను తీర్చడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తోంది. విద్యా హక్కు చట్టం ద్వారా 6-14 ఏళ్ల వయస్సులోని ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రాథమిక విద్య అందించాల్సిందిగా ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర అమోఘం. అయితే, ఈ హామీని కార్యరూపం దాల్చించాలంటే నాణ్యమైన మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలు లక్షల్లో ఉన్నా, వాటిపై ప్రజల నమ్మకం కొంత మేర తగ్గిపోవడం గమనించాల్సిన విషయం. దీనికి కారణాలు స్పష్టమే — మౌలిక వసతుల లోపం, ఉపాధ్యాయుల కొరత, నిర్వాకం. కానీ ఈ పరిస్థితిని పూర్తిగా ఒప్పుకోవడం కూడా న్యాయంగా ఉండదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేందుకు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వ విద్య సమాజంలోని అన్ని వర్గాల పిల్లలకు విద్యను సమానంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సామాజిక సమానత్వానికి బలమైన మద్దతుగా నిలుస్తుంది.
విద్య ద్వారా పేదలు, బలహీన వర్గాలు జీవన ప్రమాణాల్లో పురోగతి సాధిస్తున్నారు. అవగాహన పెరిగే కొద్దీ తరం మార్పుకు బీజం పడుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువగా లాభదృష్టితో నడుస్తున్నప్పుడు, ప్రభుత్వ విద్య వ్యవస్థ మాత్రం విద్యార్థుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా తీసుకుని పనిచేస్తోంది. విద్యా ప్రమాణాల మెరుగుదలే దేశ అభివృద్ధికి మార్గం. గుణాత్మక మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వ విద్య కీలకం. ప్రతి పాఠశాల విద్యార్థులకు తగిన బద్రత, మంచినీటి వసతి, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అవసరం. నూతన బోధనా పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే అవకాశాలివ్వాలి. డిజిటల్ తరగతులు, ఆన్‌లైన్ కంటెంట్, ఈ-లెర్నింగ్ వనరులు విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించగలవు.
ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు చాటి చెప్పడం ద్వారా వారి మద్దతును పొందాలి. ఇది విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా దోహదం చేస్తుంది.
పాఠశాలలపై క్రమం తప్పని పర్యవేక్షణ, సమస్యలపై తక్షణ స్పందన వ్యవస్థను నిర్మించాలి. ప్రభుత్వ విద్య అనేది పేద, మధ్య తరగతి మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు ఒక ఆశాజ్యోతి. ఇది సమానత్వానికి మూలాధారంగా, గుణాత్మక విద్యకు మార్గదర్శకంగా, సామాజిక న్యాయానికి సాధనంగా నిలుస్తోంది. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు — ప్రతి పౌరుని బాధ్యత కూడా. మన పిల్లల భవిష్యత్, మన దేశ అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కనుక, ఈ వ్యవస్థపై నమ్మకం పెంచి, అందరూ కలిసి ప్రభుత్వ విద్యకు గౌరవం కలిగించే దిశగా అడుగులు వేయాలి.
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి:- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి