బహుమతి : సరికొండ శ్రీనివాసరాజు
     పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలు అయ్యింది. విద్యార్థులు అందరికీ చాలా ఇష్టమైన గురువు పాండురంగ మాస్టారు. వచ్చే ఏప్రిల్లో రిటైర్ కాబోతున్నారు. విద్యార్థులకు గొప్ప ఆఫర్ ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో అత్యుత్తమ విద్యార్థికి ఊహించని గొప్ప విలువైన బహుమతులు ఇస్తాను అని ప్రకటించారు. విద్యార్థులకు చాలా సంతోషం అనిపించింది.
     అన్ని తరగతుల్లో ఉత్సాహవంతులైన విద్యార్థులు మరింత పట్టుదలతో కష్టపడి చదువుతున్నారు. ఎన్నడూ లేనిది 10వ తరగతిలో చందన అనే అమ్మాయి చదువును మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఆ తరగతిలో ఫస్ట్ ర్యాంకు వచ్చే రేణుక అనే అమ్మాయి వద్దకు చేరి, సబ్జెక్టుల్లో తనకు వచ్చే అనుమానాలు అడుగుతుంది. "నా టైం వేస్ట్ చెయ్యకు. నేనే దొరికానా? నాతో పోటీగా ఫస్ట్ వచ్చే వందన ఉంది కదా! ఆమె దగ్గరకు వెళ్ళు." అన్నది. వందన దగ్గరకు వెళితే "నాకు టైం వేస్ట్ కాదా! అయినా నీతో నాకు ఫ్రెండ్ షిప్ ఏమిటి? వెళ్ళి టీచర్లను అడుగు నీ డౌట్లు." అన్నది..
     9వ తరగతిలో సతీశ్ అనే అబ్బాయి తరచూ పాఠశాలకు డుమ్మా కొడుతూ ఇంటి వద్ద లేవకుండా చదువుతున్నాడు. మోహన్ ఎన్నడూ లేని విధంగా, గురువు గారికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు పెడుతూ, తరచూ గురువు గారి యోగ క్షేమాలు విచారిస్తూ తీయగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీహరి వీలు దొరికినప్పుడల్లా గురువు దగ్గరకు వచ్చి, "మీకు ఎమైనా సహాయం కావాలా సర్! ఎంత పెద్ద పని అయినా చిటికెలో చేసేస్తా!" అనేవాడు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. 
      ఏప్రిల్ 23. అందరు విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. 10వ తరగతి పరీక్షలు రాసి వెళ్ళిన విద్యార్థులు కూడా ఆరోజు వచ్చాడు. విద్యార్థులు అందిరినీ సమావేశ పరిచారు. 10వ తరగతి విద్యార్ధిని అలివేలు, అదే తరగతి చదువుతున్న నరేశులను ఉత్తమ విద్యార్థులుగా ప్రకటించారు పాండురంగం గారు. "వారు ఇద్దరూ చదువుతో పాటు మంచి లక్షణాలను అలవరచుకున్నారు. తల్లిదండ్రులకు, గురువులకూ ఎప్పుడూ ఎదురు మాట్లాడలేదు. టీవీలు, సెల్ ఫోన్లకు చిన్నప్పటి నుంచీ చాలా దూరం. తీరిక సమయాలలో గ్రంథాలయాలకు వెళ్ళి, రకరకాల ఉత్తమ పుస్తకాలను చదువుతారు. వీరి మంచి ప్రవర్తన వల్ల వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ. తీరిక సమయాలలో తాము చదువుకుంటూ వారిని కూడా చదువులో ప్రొత్సహిస్తారు. ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళ గొప్పతనాన్ని చాలా చెప్పవచ్చు." అని చెప్పి, వారి ఇద్దరినీ పిలిచి, ఎన్నో ఉత్తమ పుస్తకాలను బహూకరించాడు పాండురంగ మాస్టర్. అందరూ చప్పట్లు కొట్టారు.

కామెంట్‌లు