పెన్సిలు - రబ్బరు:- - యామిజాల జగదీశ్
 “హలో, ఎలా ఉన్నావు?” అని పెన్సిలుని ఎంతో ప్రేమగా అడిగింది రబ్బరు (Eraser, ఎరాజెర్).
“నీ పలకరింపు బాగానే ఉంది కానీ నువ్వేమీ నా స్నేహితుడివి కాదు” అంది పెన్సిల్. అక్కడితో ఆగకుండా “నేను నిన్ను ద్వేషిస్తున్నాను.” అని గట్టిగా చెప్పింది పెన్సిల్.
ఈ మాటతో రబ్బరు మనస్సు చివుక్కుమంది. నొచ్చుకుంది. “ఇంతకూ ఎందుకు నేనంటే ద్వేషం?” అని అడిగింది రబ్బరు.
“ఎందుకంటావేమిటీ...చేసేదంతా చేసేస్తావ్. నేను రాసే వాటిలో నీకు నచ్చనివేవైనా ఉంటే చెరిపేస్తావు....” అంది పెన్సిల్.
“ఔను, నువ్వన్న దాంట్లో సగమే నిజం...కానీ ఎందుకు చెరిపేస్తానో తెలిస్తే నువ్విలా అనవు...తప్పనిపించిన వాటిని మాత్రమే తొలగిస్తాను” అంది రబ్బర్ మృదువుగా.
“అందుకే నువ్వు నాకు నచ్చడం లేదు" అంది పెన్సిల్.
“కానీ నన్నేం చెయ్యమంటావు. నన్నందుకేగా పుట్టించారు" అని ఏదో చెప్పబోయింది రబ్బరు. 
కానీ పెన్సిల్ దాని మాటకు అడ్డు తగిలి "నా దృష్టిలో నీ పని అర్థరహితం. తొలగించడం కంటే రాయడం ౠంతో ముఖ్యం.” అంది.
“నువ్వన్నది నిజమే, కాదనలేం లేదు కానీ రాయడం ఎంత ముఖ్యమో తప్పును తొలగించడం కూడా అంతే ముఖ్యమూ, సరైనది కూడా" అని రబ్బర్ అతి వినమ్రతతో చెప్పింది.
పెన్సిల్ కాస్సేపు మౌనంగా ఉండి “సరే కానీ నువ్వు అద్దంలో చూసుకుంటున్నావో లేదో కానీ ప్రతిరోజూ నీ రూపం చిన్నదై పోతోంది....” అని చెప్పింది.
“ఔను, నువ్వన్నది నిజమే. ఎందుకంటే నేను తప్పును సరిదిద్దడానికి సహకరించే ప్రతిసారీ నన్ను నేను కొంత వదులుకుంటాను” అంది రబ్బర్.
“నువ్వే కాదు, నేను కూడా తరిగిపోతూ ఉంటాను. నన్నూ చెక్కేస్తుంటాడీ మనిషి...పైగా ఎంత దారుణమో తెలుసా...కొందరైతే బ్లేడుతో చెక్కేస్తారు. అప్పుడు నా బాధ చెప్పలేనిది ” అంది పెన్సిల్.
“కానీ మనమేం చేయగలం...ఈ మనుషి చేతిలో పడ్డాక అవన్నీ ఆలోచించకూడదు. ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే తప్ప మనం ఇతరులకు మంచి చేయలేం.
అన్నట్లు ఇంకా నేనంటే నీకు ద్వేషమేనా?” అని మెల్లగా అడిగింది రబ్బరు.
పెన్సిల్ చిన్న నవ్వు నవ్వి
“ఓ తప్పును సరిదిద్దడానికి నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటున్నావన్న నిజం తెలిశాక నేను నిన్నెలా ద్వేషిస్తాను?” అంది. 
మనమిద్దరం మిత్రులమే ఈ క్షణం నుంచి అంటూ పెన్సిల్ కరచాలనం చేసింది రబ్బరుతో.
క్యాలండరులో ఏడాదికేడాది ఒక సంవత్సరం పెరుగుతుంది. కానీ మనిషి జీవితంలో వయస్సు పెరిగే కొద్దీ ఆయుష్షు తగ్గుతుంది. ప్రతి రోజు మనం మేల్కొంటాము. మేల్కొనే ప్రతి సారి మన ఆయుష్షులో ఒక రోజు తగ్గుతూ వస్తుంది.
ఇతరులకు ఆనందాన్ని కలిగించే పెన్సిల్‌గా మనం ఉండలేకపోతే, కనీసం వారి బాధను తుడిచిపెట్టే రబ్బరుగానైనా ఉండాలి. వారిలో ఆశను నాటుతూ నమ్మకం కల్పించేలా ఉండాలి మన ప్రవర్తన. భవిష్యత్తు మాటెలా ఉన్నా వర్తమానంలో మంచి ఆలోచనను అనుసరించడం ఉత్తమం. పుట్టినందుకు కృతజ్ఞతతో ఉండాలి. ఎల్లప్పుడూనూ!!

కామెంట్‌లు