సునంద భాష్యం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-881
కాంతార న్యాయము
****
కాంతార అనగా  పేరడవి, పోరాని త్రోవ, నడవడానికి వీలుపడని దారి అరణ్యం,మంచు అరణ్యం అనే అర్థాలు ఉన్నాయి.
ప్రయాణికుడు అడవి దగ్గర పడగానే ఒక బిడారు లోనికి చేరి వారి సహాయంతో అడవిని దాటగానే తన దారిన తాను పోతాడు.అనగా అడవిని ఐక్కతతో జయించి వెళతాడు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
"కాంతార " అనగానే   కన్నడంలోనూ తెలుగులోనూ విడుదలైన సినిమా కళ్ళముందు మెదులుతుంది. కాంతార అనగా  కన్నడంలో కూడా అదే అర్థం అడవి లేదా అరణ్యం.
ఈ "కాంతార" కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన  విషయాలను మనం తెలుసుకుందాం.
హిందూ మతంలో ఆయుర్వేద పదకోశం 13వ శతాబ్దపు రాజ్ నిఘంటువు ప్రకారం 'కాంతార' అనే పదం అడవిని సూచిస్తుంది.
ఇతిహాసాలలో ఒకటైన రామాయణంలో సీతమ్మ వారు రామునితో" నేను కూడా అరణ్యవాసానికి వస్తాను" అన్నప్పుడు సుకుమారమైన సీతతో "వస్తాననే ఆలోచనను వదులుకొమ్మని" "అరణ్యం అనేక ప్రమాదాలతో నిండి వుంటుంది.చాలా అసౌకర్యాలు ఉంటాయి " తనతో రావద్దని రాముడు వారిస్తాడు.
అలాగే వరాహ మిహిరుడు రాసిన బృహత్ సంహితలో కూడా  ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలతో అనుసంధానం చేస్తూ కాంతార గురించి వివరిస్తూ రాయడం జరిగింది.
ఇక యాజ్ఞవల్క్యుడు తాను రాసిన యోగా పదకోశంలో "కాంతార" అనేది అడవి అని, ఇది త్యాగ కర్మలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని,యోగ సాధనకు అనుకూలమైన ప్రదేశమని చెప్పారు.
మరొక విశేషం ఏమిటంటే  వాస్తు శాస్త్రానికి సంబంధించిన " పద్మ సంహిత"లో  'కాంతార'" అనేది యాభై రెండు రకాల దేవాలయాలలో ఒక దానిగా సూచించడం జరిగింది.
ఇక వేదాంత పద కోశములోని అష్టావక్ర గీతము ( ఇది క్రీ.పూ.5 వ శతాబ్దం) ప్రకారము 'కాంతార ' అనేది "సంసార అడవిని" గురించి వివరిస్తుంది.సంసారమనే అడవి అనగా కాంతారలో మనసు ఎప్పుడూ తృప్తి పొందలేదని... ఇలా అనేక విషయాలు అష్టావక్రుడు జనకునికి చెప్పడం అందులో చూస్తాము.
హిందూ మతమే కాకుండా బౌద్ధమతంలో కూడా  "కాంతార" ప్రస్తావన ఉంది. మహాయాన పద కోశంలో కాంతార అనగా అడవితో పాటు ఎడారి అనే అర్థం కూడా ఉంది.మహాయాన బౌద్ధ సూత్రాల సమాహారం అయిన "మహా సంనిపాత" లో గగన గంజ పరిపృచ్ఛా ప్రకారం"కాంతార" అనగా అరణ్యం మూడు లోకాలను సూచిస్తూ అనేక వివరణలు ఇస్తుంది.
జైన మత గ్రంథం ప్రకారం "కాంతార" అనేది పునర్జన్మ చక్రం యొక్క అడవిని సూచిస్తుంది.
చివరగా జీవశాస్త్ర విషయానికి వస్తే కాంతార అనేది ఒక మొక్క పేరు.ఈ విషయాలు అన్నింటినీ విస్డమ్ లైబ్రరీలో చదువుతున్నప్పుడు చాలా సంతోషం కలిగింది.కాంతార పదం గురించి 34 నిర్వచనాలతో కూడిన ఇంత సమాచారం దొరుకుతుందని అనుకోలేదు.
 ఇక విషయానికి వద్దాం. ఈ న్యాయము ప్రకారం మనమంతా జీవన గమనంలో ప్రయాణీకులం. సంసారమనే అడవిలో ప్రయాణం చేసేటప్పుడు రాముల వారు సీతమ్మకు చెప్పినట్లు అనేక రకాల ప్రమాదాలు ఎదురవుతాయి.ఎన్నో అసౌకర్యాలు ఉంటాయి.మరి జీవిత లక్ష్యమైన అంతిమ స్థానం ముక్తి పథం చేరాలంటే,అడవిలాంటి సంసారాన్ని జయించాలంటే మనకొక  నెలవు లేదా తావు కావాలి.ఆ తావే అంతరంగం లేదా ఆత్మ. సహాయకులే ఇంద్రియాలు. మచ్చిక చేసుకున్న ఇంద్రియాల సహాయంతో , ఆత్మ విశ్వాసం, ఆత్మస్థైర్యం సాహసోపేత గుణాల ఐక్యతతో సంసారమనే అడవిని సునాయాసంగా జయించగలమని మన పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
ఇక్కడ అడవిని జయించడం అంటే మనల్ని మనం జయించడమే.మనలోనే ఓ పెద్ద సంసారం ఉంది,సాగరం ఉంది ఆ రెండింటితో పాటు బహు దుర్గమమైన అడవి కూడా ఉంది.వీటన్నింటినీ జయించి మన దారిన మనం పోవాలంటే మనలోని పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు మనసుతో కలిసి  ఐక్యతతో పోరాడాలి. అప్పుడే "కాంతార న్యాయము"నకు  న్యాయము జరుగుతుంది.
 
ఈ న్యాయము లోని అంతరార్థము ఇదే . దీనిని గ్రహించి మనల్ని మనం జయించే దిశగా ప్రయత్నాలు చేస్తూ మనదైన దారిన పోదాం.

కామెంట్‌లు