"నీ తల్లిని...నీ తండ్రిని పూజింపుము"
"నీవు దీర్ఘాయుష్మంతుడ వగుదువన్నది"
"బైబిల్ బోధించే దివ్య జ్ఞాన ప్రవచనం"..!
అదిగో...ఆ వృద్ధ జంట
ఎవరో అనాధలు కారు...
మీ అమ్మానాన్నలే వారు..!
మీరేమన్నారో ఏమో తమ
ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక
వీధిలో కూర్చొని విలపిస్తున్నారు..!
వాళ్ల చెంతకు చేరి ప్రేమగా అడిగా
"బాబాయ్..! మీ బాధేంటి..?" అని...
"అమ్మా..! నీ ఆవేదన ఏంటీ..? అని..!
ఆ వృద్ధ జంట...
గుప్పెడు గుండెలో
గూడుకట్టుకున్న కొండంత
బాధతో చెబుతున్నదొక్కటే...
"భగవద్గీత"చెప్పినట్లు...
మేం మా పిల్లల నుండి
ఏ ప్రతిఫలం ఆశించకుండా
బాధల లోంచి సాగిన బాటలో...!
అప్పులపాలై...
అవమానాలు భరించి...
ప్రేమల్ని పంచామని...
పిల్లల్ని పెద్ద చేశామని...
పెళ్ళిళ్లు జరిపించామని...
ఆర్జించిన ఆస్తిని అందరికీ పంచామని..!
ఇప్పుడేమిలేని అనాధలమయ్యామని..!
ఆ వృద్ధ జంట...
ఆత్మాభిమానంతో ఆకలితో
అలమటిస్తూ అర్థించేదొక్కటే...
మీ విందు వినోదాలకు విలాసాలకు
మేం అడ్డురామని...మాకు ఏ
"పంచభక్ష్య పరమాన్నాలక్కర్లేదని...
"పళ్ళెంలో ఇన్ని పచ్చడి మెతుకులు...
"నిన్న మిగిలిన చద్దన్నం పెడితే చాలని..!
మేము రెక్కలు విరిగిన పక్షులమని...
కొడితే కొట్టలేని...తిడితే తిరిగి తిట్టలేని...
నిస్సహాయులమని...పదేపదే
తిట్టొద్దని...కోపంతో కొట్టొద్దని...
మనవళ్ళను...మనవరాళ్ళను
మాకు దూరంగా పెట్టొద్దని...!
"ఇంట్లో పనిమనుషుల్లా...
"వీధిలో బిక్షగాళ్లలా...
"కుక్కలకన్న హీనంగా...చూడొద్దని"...
"అత్తామామలంటే..?
"అమ్మానాన్నలని"
"బద్దశత్రువులు కాదని...
"కోడలి పిల్లకు చెప్పమని...!
ఆ వృద్ధ జంట...
బ్రతుకు భారమైందని...
అంధకారమైందని...కుమిలిపోతూ...
వెక్కివెక్కి ఏడుస్తూ వేడుకునేదొక్కటే...
"ఫ్యాన్ ఏసీ పట్టుపరుపులేవీ అక్కర్లేదని..!
"ఒక చాప...ఒక కుక్కి మంచం...
చలిపులి నుండి దోమల దాడినుండి
కాపాడే ఓ దుప్పటి ఓ దోమతెర చాలని...!
ఆ వృద్ధ జంట...చేతులెత్తి మొక్కి
కన్నీటి పర్యంతమై కోరుకునేదొక్కటే...
మాతో మాట్లాడకున్నా పర్వాలేదని...
కానీ మనసున్నట్లు నడుచుకోమని...
మనుషులుగా మానత్వంతో బ్రతకమని..!
చిన్నజబ్బు చేస్తే...మందులిప్పించమని...
పెద్దజబ్బు చేస్తే...ఎప్పుడు చస్తారో..?
ఈ ముసలినక్కలని ఎదురు చూడవద్దని
చిరుప్రేమ...చిరుగౌరవమిచ్చినా చాలని...!
ఆ వృద్ధ జంట...
కాటికి కాళ్ళు...
చాపుకుని అర్థించేది...
ఆశతో ప్రార్థించేదొక్కటే...
మేము మా పిల్లలకు భారమైననాడు...
మమ్మల్ని అనాధాశ్రమాలకు తరలించక...
ఆ పరమాత్మ పదసన్నిధికి చేర్చితే చాలని...!
ఇదే మృత్యువు ముంగిట
కూర్చున్న ఆ వృద్ద దంపతుల
ఆత్మఘోష...అంతరంగం బాష...
అర్థం చేసుకోండి..! ఓ బిడ్డలారా...
కన్నవారిని...కాటికెళ్ళేదాకా
కంటికిరెప్పలా కాపాడుకోండి..!
ప్రేమజల్లులు వారి గుండెల్లో
చిరునవ్వులతో చిలకరించండి..!
నిర్మలంగా సమాధుల్లో నిద్రించనివ్వండి..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి