అద్భుత ఆవిష్కరణ:- - యామిజాల జగదీశ్
 1922లో, టొరంటోలోని ఒక పిల్లల వార్డులో వైద్యశాస్త్రచరిత్రలో ఓ గొప్ప అద్భుతం నిశ్శబ్దంగా ఆవిష్కృతమైంది.
డజన్ల కొద్దీ మధుమేహ పిల్లలు కోమాలో ఉన్నారు. తమ తమ పిల్లలు కళ్ళు తెరిచి చూస్తే చాలు అని వారి తల్లిదండ్రులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కొందరికైతే అసలు వారు కోలుకుంటారా ఎప్పటికైనా అని ఆందోళన చెందుతున్నారు. ఈ పాడు జబ్బు పిల్లలు బాల్యాన్ని హరించేస్తుందేమోనని అందరి భయం.
అంతా అయోమయంగా ఉన్న ఆ వార్డులో కి ఓ శాస్త్రవేత్తల బృందం కొత్త దానితో ప్రవేశించింది. అది ఇదే... ఇన్సులిన్ అనే శుద్ధి చేసిన సారం!
వారు ఒక్కో బిడ్డకూ ఇంజెక్షన్  ఇస్తుండగా, ఊహించనిది జరిగింది. వారు ఇంజెక్షన్లు ఇవ్వడం పూర్తి చేసే లోపే, ఒక్కొక్క పిల్లాడి లోనూ కదలికలు కనిపించాయి. ఒకరి తరువాత మరొకరు కళ్ళు తెరచి చూస్తుంటే అందరికీ ఆశ్చర్యమూ ఆనందమూ వేశాయి‌
ఒక్కొక్కరూ నిద్రలోంచి లేస్తున్నట్లు లేవటం ప్రారంభించారు. శాస్త్రవేత్తల బృందం అక్కడికి రానంత వరకూ నిరాశతో నిండిన గదికాస్తా ఆశ్చర్యంతో వికసించింది. అందరిలోనూ అపరిమిత ఆనందం.
ఇంతకూ ఈ పురోగతి వెనుక ఎవరున్నారో తెలుసా? జాన్ మాక్లియోడ్ ఆధ్వర్యంలో పని చేసిన ఫ్రెడరిక్ బాంటింగ్, చార్లెస్ బెస్ట్ ఉన్నారు. మరోవైపు, జేమ్స్ కొలిప్ సారాన్ని శుద్ధి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ బృందం, ఇదేదో తమ ఒక్కరి విజయంగా ఉండాలనుకోలేదు‌. ఇందుకు సంబంధించిన పేటెంట్‌ను టొరంటో విశ్వవిద్యాలయానికి 1 కేవలం డాలరుకి విక్రయించారు.
1923 లో, బాంటింగ్, మాక్లియోడ్ నోబెల్ బహుమతిని అందుకున్నారు. కానీ నిజమైన బహుమతి చాలా గొప్పది. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. మధుమేహం ఉన్న ప్రతి బిడ్డకు కొత్త భవిష్యత్తుని కల్పించారు. 

కామెంట్‌లు