వెలుగు చూసి మురిసిపోవు
చీకటి నిండిన మనసుకు
వేడుకలెన్నో తెచ్చి
ఒడిలో పోస్తూ నవ్వే కాలం!
చిక్కుముడుల సమస్యలకు
చిన్ని నవ్వుతో వెన్ను తట్టి
ఒక్కక్షణంలో చక్కబరచి
దశ తిరిగేలా చేసే కాలం!
అలసిన అడుగులకు
అనునయంగా అలుపు తీర్చి
ఆశించిన ఆనందాలు
అన్నీ కాకపోయినా కొన్ని ఇచ్చే కాలం!
గజిబిజి పరుగుల జీవితాన
గబగబ నడకలో చూపు తాకని
జిలిబిలి మెరుపుల క్షణాలన్నీ
చకచకా మూట గట్టి తెచ్చే కాలం!
ఒద్దికగా మనసుపొరలలో
పొదిగిన కోరికల మడతలను
ఒకొక్కటిగా గుర్తుచేసి మరీ
ముద్దుగా తీర్చేసే కాలం!
దొరకని చెలిమి
తలవని కలిమి
ఎరుగని బలిమి
వరుసగా చవిచూపించే కాలం!
తూరుపు కొండల మాటున దాగి
ఎరుపు రంగు నింగికి అలది
మార్పుగ మనుగడ సాగేలా
వదలక వెంట ఉంటాననే కాలం!
కదిలి వస్తున్న కమ్మని వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి