న్యాయాలు -868
"చింతా జ్వరో మనుష్యాణామ్" న్యాయము.
*****
చింతా అనగా ఆందోళన,బాధ, దిగులు లేదా దుఃఖము.జ్వర అనగా శారీరక, మానసిక బాధ.మనుష్యాణామ్ అనగా మనుష్యులకు అని అర్థము.
మనుష్యులకు చింతయే జ్వరము అని అర్థము.
చింత గురించి చెప్పుకునే ముందు జ్వరము గురించి ఏయే పురాణాలు, గ్రంథాలు ఏమని చెప్పాయో తెలుసుకుందాం.
విష్ణు పురాణము ప్రకారము మనుష్యులకు మూడు రకాలైన జ్వరాలు వస్తాయని చెప్పడం జరిగింది. అందులో ఒకటి శారీరక రకానికి చెందిన బాధ. రెండవది మానసిక సంబంధమైన బాధ.మూడవది ఆధ్యాత్మిక సంబంధమైన బాధ.ఇలా మూడు రకాలైన ప్రాపంచిక బాధలను పరిశోధించి వీటి వలన మానవుడిలోని నిజమైన జ్ఞానం నశిస్తుందని చెబుతుంది.
శివ పురాణము ప్రకారము జ్వరము అనేది లయ కారకుడైన శివుని ఉగ్ర శ్వాస నుంచి ఉత్పన్నమయ్యే వంద జ్వరాలను సూచిస్తుంది.అంతేకాదు ఇవి ప్రపంచాన్ని భయపెట్టగల సామర్థ్యం ఉన్న కౄరమైన జ్వరాలని చెప్పడం జరిగింది.
ఇక యోగసార సంగ్రహ ప్రకారం జ్వరం అనేది వివిధ వ్యాధులలో ఒకటి.అలాగే వాగ్భటుడు ప్రస్తావించిన అష్టాంగ హృదయ సంహిత ప్రకారము జ్వరము లోని వివిధ రకాలను గురించి చెప్పడం జరిగింది.
ముఖ్యంగా జ్వరాలలో మూడు రకాలైన జ్వరాలు ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి.అందులో చింత అనేది మనసుకు సంబంధించినది. ఇది కూడా అనేక రకాలుగా ఉంటుంది.
కొంతమందికి ధనార్జన చింత ఉంటుంది. ప్రతిక్షణం డబ్బు ఎలా సంపాదించాలి.ఎలా స్థిర చర ఆస్తులను పోగేసుకోవాలి అనే చింత జ్వరంతోనే జీవితాంతం గడిపే వారు కొందరు మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపిస్తూ ఉంటారు.
మరికొంత మందికి ధర్మ చింత అనే జ్వరం ఉంటుంది. వారిలో "ఇదేనా జీవితం? లేవడం,తినడం, నిద్రపోవడమేనా? ఏం సాధించాం? ఈ కోరికలేమిటీ? వీటి చుట్టూ భ్రమరంలా తిరగడం ఏమిటి? అసలు మనం దేని గురించి చింతించాలి? ఈ ఆశా పాశం నుంచి బయటపడటం ఎలా? ధర్మాన్ని అనుసరిస్తే అందులోంచి బయటపడతామేమో అన్న ఆత్మ లేదా ఆధ్యాత్మిక చింత" మొదలవుతుంది.
అలాంటి ధర్మ చింత కలిగిన వారిలో తాత్త్విక దృష్టి అలవడుతుంది.అది ఏ వయసులోనైనా కలుగవచ్చు. వారిలో కొందరు ఈ జన్మలోనే దీనికి సంబంధించిన జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తారు.
ఈవిధంగా జనన మరణ చక్రంలో నుండి బయట పడాలనే ఎరుక కలిగి దివ్యత్వాన్ని పొందిన మహనీయులు ఎందరో ఈ లోకంలో ఉన్నారు.
ఏది ఏమైనా ఆధ్యాత్మిక చింతా జ్వరం మంచిదని మన పెద్దవాళ్ళు అనడమే కాకుండా ఆదిశంకరుల "మోహ ముద్గర" లోని ఈ శ్లోకాన్ని కూడా ఉటంకిస్తూ ఉంటారు.
సత్సంగత్వే నిస్సంగత్వం - నిస్సంగత్వే నిర్మోహత్వం/నిర్మోహత్వే నిశ్చల తత్వం -నిశ్చలతత్వే జీవన్ముక్తి!/
అనగా సత్సంగము ద్వారా విషయ వాంఛలలో విరక్తి భావన కలుగుతుంది.వైరాగ్యభావనలో నేను, నాది అనే స్వార్థాలు లేకుండా నిర్మోహత్వం కలిగి దాని వలన మనసు చంచలము నుండి స్థిరత్వం కలుగుతుంది.అదే జీవన్ముక్తికి మార్గమవుతుంది అని, సత్సంగము ద్వారా ద్వారా క్రమ క్రమంగా జీవన్ముక్తి పొందవచ్చని చెబుతుంటారు.
మరి ఇలాంటి చింతా జ్వరం కేవలం విద్యా జ్ఞానం తెలిసిన వారికే ఉంటుందా ?అనే సందేహానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే పండితులు, పామరులు అనే తేడా లేకుండా చాలా మందిలో ఇలాంటి తాత్త్విక చింతన ఉంటుంది. "మహాకవి ధూర్జటి" ఏమంటాడంటే కేవలం మనుషులకే కాదు వివిధ ప్రాణులకు కూడా ఉంటుందనీ, అలాంటి దృష్టి కలగవచ్చునని చెబుతూ " ఏ వేదంబు పఠించె లూత? భుజగంబే శాస్త్రముల్ సూచె?.. వాటికి భగవంతుడే సత్యం అనే జ్ఞానం కలిగింది కదా" అంటాడు.
ఇలా మనో చింతా జ్వరం మంచిదైతే మనిషికి మంచి జరుగుతుంది. ఐహిక సుఖాల చింతా జ్వరమైతే ఆనందం దూరమై బ్రతుకు దుఃఖభాజనం అవుతుందని గ్రహించాలి.
"చింతా జ్వరో మనుష్యాణామ్ న్యాయము" లోని అంతరార్థము ఇదే. ఇది తెలుసుకుని ఆధ్యాత్మిక,ధర్మ చింతనతో జీవితాన్ని గడుపుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి